తాజా వార్తలు

Monday, 4 July 2016

టీడీపీలో ఈ ఎమ్మెల్యే రూటే సపరేటు..

ఈయన పేరు వైకుంఠం ప్రభాకర్ చౌదరి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే. అందరికంటే భిన్నంగా ఉంటాయి ఈయన రాజకీయాలు. సాధారణంగా ప్రభుత్వాల పనితీరుపై పాలక పెద్దలు శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటారు. అది కూడా విపక్షాలు డిమాండ్‌ చేసినప్పుడు మాత్రమే. కానీ మన ప్రభాకర్‌ చౌదరిగారు రూటే సపరేటు. ఆయనను ఎవరూ ప్రశ్నించకపోయినా... ఆయన తన నియోజకవర్గంలో తాజా పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు తీరును అందులో విస్పష్టంగా పేర్కొన్నారు.
                 
              1998 కాలంలో ప్రభాకర్ చౌదరి మునిసిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు కూడా తన ఆస్తులు, చేపట్టిన అభివృద్ధి పనుల గురించి శ్వేతపత్రం విడుదలచేశారు. ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్న ఆయన తాజాగా మరోసారి శ్వేతపత్రం రిలీజ్‌చేశారు. ఏ అంశం మీద అయినా సరే, ప్రభాకర్‌ చౌదరి ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. క్షణాల్లో స్పందిస్తారు. అందుకే ఆయన వ్యవహారశైలి కార్యకర్తలకు నచ్చుతుంది. దీనికి తోడు ఆయన తాను చేసే కార్యక్రమాల్లో దాపరికానికి తావివ్వరు. ప్రతిదీ పారదర్శకంగా ఉండాలని భావిస్తారు. అదే మార్గంలో నడుస్తారు.
             
                అనంతపురం జిల్లా కేంద్రం కావడంతో ముఖ్యంగా రెండు వర్గాలకు చెందిన నేతలతో ప్రభాకర్‌ చౌదరి నిత్యం పోరాటం చేయాల్సి పరిస్థితి. గతంలో ఎన్‌.టి. రామారావు స్వయంగా ప్రభాకర్‌ చౌదరిని మున్సిపల్‌ చైర్మన్‌ పదవికి ఎంపికచేశారు. మున్సిపల్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడు 100 ఎకరాల విస్తీర్ణంలో పార్కు ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లోని ట్యాంకుబండ్‌ మాదిరిగా జాతీయ, సామాజిక, సాంస్కృతిక దిగ్గజాల విగ్రహాలను అందులో ఏర్పాటుచేశారు. నగరాన్ని ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దిన ప్రభాకర్‌ చౌదరికి సొంత పార్టీలోనే కొందరు వ్యతిరేకులు తయారయ్యారు. దీంతో ఆయనకు అసెంబ్లీ టిక్కెట్టు దక్కలేదు. తర్వాత కొద్దికాలంపాటు ఆయన తెలుగుదేశానికి దూరమయ్యారు. 2004లో తిరిగి టీడీపీ గూటికి వచ్చినప్పటికీ చౌదరికి టిక్కెట్లు లభించలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయనకు 30 వేలకు పైగా ఓట్లు వచ్చాయి.
                     
                  తదనంతరం- ప్రభాకర్‌ చౌదరి కొన్నాళ్లపాటు సామాజిక కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. ఫ్యాక్షన్‌కు వ్యతిరేకంగా "అవే'' అనే సంస్థను ఏర్పాటుచేశారు. ఈ సంస్థ మూడు రాష్ట్రాలకు విస్తరించింది. ప్రజాచైతన్య యాత్రలు నిర్వహించారు. అవే సంస్థ స్వరపరచిన ఒక పాటను జగపతిబాబు ఒక సినిమాలో ఉపయోగించుకున్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులను తగిన రీతిలో సత్కరించే సంప్రదాయానికి కూడా ప్రభాకర్‌ చౌదరి శ్రీకారంచుట్టారు.
                 
                 2014లో ఎన్నికల్లో ప్రభాకర్‌ చౌదరికి టీడీపీ టిక్కెట్టు లభించింది. భారీ మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఎమ్మెల్యేగా తన మార్కును ప్రదర్శించుకోవాలన్నదే ప్రస్తుతం ఆయన తాపత్రయం! సొంత పార్టీలో రెండు మూడు గ్రూపులకు సంబంధించిన నేతలతో తలపడుతూనే తనదైన పంథాలో సాగుతున్నారు. అనంతపురం నగరంలో ప్రశాంత వాతావరణం ఏర్పాటుకావాడం కోసం కృషిచేస్తున్నారు. అభివృద్ధి విషయంలో ఎడ్డెం అంటే తెడ్డెం అనే రెండు వర్గాలు ఉన్నప్పటికీ చౌదరి పట్టువీడని విక్రమార్కుడిలా ముందడుగు వేస్తున్నారు. భూకబ్జాలు, ఇతర దందాలను అడ్డుకునే విషయంలో సొంత పార్టీ నుంచే ఆయనకు సహాయనిరాకరణ ఎదురవుతోంది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నా ప్రభాకర్‌ చౌదరి ఏమాత్రం డీలాపడటం లేదు. తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే కర్తవ్యాన్ని మరవడం లేదు. పనిలో తనకు సవాళ్లు విసిరే శక్తులకు తగిన జవాబు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కావచ్చు... నియోజకవర్గ అభివృద్ధిపైన, తను ఇచ్చిన హామీల అమలుపైన ప్రభాకర్‌ చౌదరి శ్వేతపత్రం విడుదల చేశారు.
             
               సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో కూడా ఈ మధ్య మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో చౌదరే స్వయంగా రంగంలోకి దిగారు. ఎక్కడా అవినీతికి తావివ్వకుండా తానే చెక్కులను బాధితులకు అందజేస్తున్నారు. జిల్లాకేంద్రంలో ఆర్టీఓ కార్యాయం, బస్టాండ్ తదితర రద్దీప్రాంతాల్లో తాగునీటి కోసం వాటర్‌ప్లాంట్లను ఏర్పాటుచేశారు. ఏబీఎన్ ఆధ్వర్యంలో మూడు లక్షల మొక్కలను ఒకేరోజు నాటగా ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్సులో కూడా అనంతపురం ఎమ్మెల్యే ప్రస్థావన వచ్చింది. ప్రభాకర్‌ చౌదరిని ఆదర్శంగా తీసుకోవాలని సీఎం చెప్పారు. ఇక తాజా విషయానికి వస్తే.. నియోజకవర్గ అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేసిన మొదటి నాయకుడిగా జిల్లాలో ప్రభాకర్‌ చౌదరి గుర్తింపుపొందారు. తాను విడుదల చేసిన పత్రాన్ని ఇంటింటికీ తిరిగి పంచుతున్నారు. ఎక్కడైనా తన పని విధానంపై విమర్శలుంటే పూర్తి సమాచారంతో నిరభ్యంతరంగా తనవద్దకు రావచ్చునని జన్మభూమి కమిటీలకు ఆయన సూచిస్తున్నారు. ఆయన వ్యవహారశైలి పార్టీ నేతలకు నచ్చినా నచ్చకపోయినా... ప్రజలు మాత్రం ఆహ్వానిస్తున్నారు. ఇదండీ ప్రభాకర్‌ చౌదరి తాజా రాజకీయ ప్రస్థానం..!
« PREV
NEXT »

No comments

Post a Comment