తాజా వార్తలు

Saturday, 9 July 2016

ఆస్తానా పాఠాలు

‘అమరావతి నిర్మాణంలో ఎలాంటి పొరపాట్లు చేయదల్చుకోలేదు. ఇటీవలి కాలంలో నిర్మితమైన రాజధాని నగరాల్లో ఆస్తానా అద్భుతమైన నగరం. మీ రాజధాని నిర్మాణంలో జరిగిన తప్పొప్పుల నుంచి పాఠాలు నేర్చుకొంటాం. మీ అనుభవం మాకెంతో అవసరం. అమరావతిలో పర్యటించి తగిన సలహాలు.. సూచనలు ఇవ్వండి’ అని సీఎం చంద్రబాబు కజకిస్థాన్‌ రక్షణ మంత్రి తస్మాగమ్‌ బెతోవ్‌ను కోరారు. కజకిస్థాన్‌, రష్యా పర్యటనలో భాగంగా తొలి రోజు సీఎం బృందం కజకిస్థాన్‌లో పర్యటించింది. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరిన సీఎం బృందానికి కజకిస్థాన్‌లో సంప్రదాయ రీతిలో స్వాగతం లభించింది.
 
తొలుత కజకిస్థాన్‌ పాత రాజధాని అల్మాటిలో పర్యటించిన సీఎం బృందం అక్కడ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కోక్‌ టోబోను సందర్శించింది. ఇక్కడికి చేరుకొనేందుకు నగరం మధ్య నుంచి కేబుల్‌ కార్‌ ద్వారా సీఎం బృందం ప్రయాణించింది. నగరం నడి మధ్య నుంచి వెళుతున్న కేబుల్‌కారు సీఎంను ఆకట్టుకుంది. ఈ తరహా పర్యాటక కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిందిగా తన వెంట ఉన్న అధికారులను కోరారు. అనంతరం సీఎం చంద్రబాబు కజకిస్థాన్‌ నూతన రాజధాని ఆస్తానాకు చేరుకొంది. అక్కడ ఆస్తానా మాజీ మేయర్‌, కజకిస్థాన్‌ రక్షణ మంత్రి బెతోవ్‌ సీఎం బృందానికి స్వాగతం పలికారు. బెతోవ్‌, ఇతర ఉన్నతాధికారులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. కజకిస్థాన్‌, ఏపీ నడుమ ఎన్నో సారూప్యతలు ఉన్నాయని చెప్పారు. సోవియెట్‌ రష్యా నుంచి విడిపోయిన కజకిస్థాన్‌ అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని, ఇటీవలే విభజనకు గురైన ఏపీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు.
 
మా ఆర్కిటెక్టులనూ పిలిపించుకోండి
జపాన్‌, దుబాయ్‌, సింగపూర్‌ ఆర్కిటెక్టులనే కాకుండా తమ దేశ ఆర్కిటెక్టులను కూడా పిలిపించుకోవాలని, వారి అనుభవాలు అమరావతి నిర్మాణానికి ఉపయుక్తంగా ఉంటాయని కజకిస్థాన్‌ మంత్రి బెతోవ్‌.. చంద్రబాబుకు సూచించారు. తమ రాజధాని నిర్మాణానికి పదేళ్లు పట్టిందని, అది 18 ఏళ్ల క్రితం నాటి మాటన్నారు. ఇప్పుడు సాంకేతికత పెరిగిందని అమరావతిని ఐదు నుంచి ఏడేళ్లలో నిర్మించుకోగలరనే నమ్మకం తనకుందన్నారు. నవీన నగరానికి సరైన ప్రణాళికతో కూడిన రవాణా వ్యవస్థ కీలకమని, అమరావతిలో ప్రజారవాణా వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలన్నారు.
 
మౌలిక సదుపాయాలకు పెద్దపీట
నూతన రాజధాని నగర రూపకల్పనకు ప్రభుత్వ, విదేశీ, ప్రైవేటు కంపెనీల నుంచి పెట్టుబడులు సమీకరించామని కజకిస్థాన్‌ మంత్రి బెతోవ్‌ వివరించారు. విద్యుత్తు, మురుగునీటి పారుదల వంటి మౌలిక సదుపాయాలన్నీ భూగర్భం నుంచే నిర్మించామని, నగర నిర్మాణంలో సింహ భాగాన్ని మౌలిక వసతుల కల్పనకే ఖర్చు పెట్టామని బెతోవ్‌ వివరించారు. పక్కా ప్రణాళిక ఉంటే నవీన నగరాలను నిర్మించడం సులభతరమేనన్న బెతోవ్‌, ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 20 బిలియన డాలర్లకు తగ్గకుండా పెట్టుబడులను ఆకర్షిస్తారనే నమ్మకం తనకు ఉందని ఉద్ఘాటించారు. ప్రపంచంలో డబ్బుకు కొదవ లేదని, పెట్టుబడులకు భరోసా కల్పిస్తే చాలని ఆయన అభిప్రాయపడ్డారు. నిబంధనలు, చట్టాలు సరళతరంగా పారదర్శకంగా ఉండాలని సూచించారు. తాము నమ్మకం కల్పించాము కాబట్టే పెట్టుబడుదారులు ముందుకు వచ్చి ఆస్తానాను అద్భుతంగా నిర్మించారన్నారు.
 
బెతోవ్‌ వివరించిన ఆస్తానా ప్రస్థానం.. జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి..
అనంతరం కజకిస్థాన్‌ రక్షణ మంత్రి బెతోవ్‌ మాట్లాడుతూ.. విభజన కష్టాల నుంచి నిర్మితమైన ఆస్తానా తరహాలోనే అమరావతి కూడా అద్భుతమైన నగరంగా ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు దూరదృష్టితో ఆస్తానా కన్నా వేగంగా అమరావతి రూపుదిద్దుకుంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. తమ రాజధాని నిర్మాణంలో ఎదుర్కొన్న కష్టాలను వివరించారు.. రష్యా నుంచి విడిపోయిన తొలినాళ్లలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకూ డబ్బులేని పరిస్థితి ఉండేదన్నారు. కష్ట సమయంలో తమ దేశంలోని వైద్యులు, ఉద్యోగులు ఎంతో సహకారం అందించారని ఏడాదిపాటు జీతాలు తీసుకోకుండా ఉచితంగా సేవలు అందించారని వివరించారు.
 
కొత్త రాజధాని ఎందుకన్నారు..
తీవ్రమైన విభజన కష్టాలను ఎదుర్కొంటున్న కజకిస్థాన్‌కు కొత్త రాజధాని అవసరమా అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించారని రక్షణ మంత్రి బెతోవ్‌ తెలిపారు. అయితే, కొత్త రాజధానిని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రజలందరికీ వివరించామన్నారు. ‘పాత రాజధాని అల్మాటి దేశానికి ఓ మూలన ఉండేది. దేశం నడిబొడ్డున రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించాం. వారు కూడా మా ప్రభుత్వ వాదనతో ఏకీభవించారు’ అని బెతోవ్‌ తెలిపారు. 2.72 మిలియన చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలో తొమ్మిదో అతి పెద్ద దేశంగా ఉన్న కజకిస్థాన్‌కు పాత రాజధాని అంత సౌకర్యవంతంగా లేదన్న విషయం అందరికీ అర్థమైందని, అయినా ప్రతి ఒక్కరిలో సందేహాలే. దేశంలో 99 శాతం మంది.. కొత్త రాజధాని నిర్మించగలమా? అన్న అనుమానంతో ఉండేవారని తెలిపారు. ‘మా అధ్యక్షుడికి మేము సాధించగలమనే నమ్మకం ఉంది. ధైర్యంగా ముందడుగు వేశారు. ప్రస్తుతం మా రాజధాని 18వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం’ అని బెతోవ్‌ తమ రాజధాని నిర్మాణ ప్రస్థానాన్ని ముఖ్యమంత్రికి వివరించారు.
 
అద్భుతనగరి ఆస్తానా
‘రష్యా నుంచి విడిపోయిన తర్వాత మీరు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. వాటన్నిటినీ అధిగమించి అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించుకొన్నారు. ప్రపంచమంతా మీ గురించి మాట్లాడుకొనే స్థాయికి ఎదిగారు’ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. మీరు నగర నిర్మాణానికి అనుసరించిన పద్ధతుల్ని తెలసుకొనేందుకే తాము వచ్చామని తెలిపారు. అమరావతి నిర్మాణంలోను ఆయా పద్ధతులు, పరిజ్ఞానాన్ని వాడుకుంటామన్నారు. ‘ఆస్తానా అభివృద్ధి ప్రస్థానాన్ని.. నగర నిర్మాణాన్ని చూసి ముగ్ధుడైన మా ప్రధాని మోదీ నన్ను కూడా ఆస్తానా చూసి రావాలని పదే పదే సూచించారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఉమ్మడి రాషా్ట్రనికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన తనకు సైబరాబాద్‌ పేరిట కొత్త నగరాన్ని నిర్మించిన అనుభవం ఉందని చంద్రబాబు వివరించారు. ఇప్పుడు మళ్లీ కొత్త రాజధాని నగరాన్ని నిర్మించుకోవాల్సిన అవశ్యకత ఏర్పడిందని తెలిపారు. తనపై విశ్వాసంతో వేలాది మంది రైతులు రాజధాని కోసం భూములను ఇచ్చిన వైనాన్ని బెతోవ్‌కు వివరించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment