తాజా వార్తలు

Monday, 4 July 2016

అవినీతిని ప్రశ్నించిన నాగంపై దాడా!


మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల్లో పెద్దఎత్తున జరుగుతున్న కుంభకోణాల గురించి ప్రశ్నిస్తున్న నాగం జనార్దన్‌రెడ్డిపై దాడి చేస్తున్న అధికార టీఆర్‌ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, శాసనసభాపక్ష నాయకుడు కిషన్‌రెడ్డి, పార్టీ నేతలు నాగం జనార్దన్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, బద్దం బాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ... అధికారంలో ఉన్నామనే అహంకారంతో టీఆర్‌ఎస్ నేతలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంచనాల తయారీ నుంచి కాంట్రాక్టుల దాకా వందల కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగమైందన్నారు. ఈ అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలతో న్యాయ పోరాటం చేస్తున్న నాగంపై మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్ నేతలు దాడికి దిగడం బాధాకరమని, దీనిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.   
 అసదుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలి : ఐసిస్ ఉగ్రవాదులకు న్యాయ సహాయం చేస్తామని బహిరంగంగా ప్రకటించిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌పై తగిన చర్యలు తీసుకొనేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను లక్ష్మణ్ కోరారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది అందరికీ శత్రువేనన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి న్యాయ సహాయం అందిస్తామనడం ద్వారా ఒవైసీ ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారని ప్రశ్నించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment