తాజా వార్తలు

Tuesday, 12 July 2016

ఏ రాష్ట్రంలో చూసినా… వరద బీభత్సమే..


మధ్యప్రదేశ్‌లో వరదలు 22 మందిని బలితీసుకున్నాయి. మరో తొమ్మిది మంది ఆచూకీ దొరకలేదు.. అసోంలోనూ ఇద్దరు చనిపోయారు. దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు దాదాపు రెండు లక్షలమంది నిరాశ్రయులయ్యారు. బ్రహ్మపుత్ర, నర్మద, గోదావరి… ఏ నది చూసినా… ఉరకలెత్తే వరదలే.. కుంభవృష్టి వానలకు ఏ రాష్ట్రంలో చూసినా… వరద బీభత్సమే.. మధ్య ప్రదేశ్‌ నుంచి అసోం వరకు, గుజరాత్ నుంచి బెంగాల్ వరకు.. అంతటా వర్షాలే.. వర్షాలు.. భారీ వర్షాలు భయపెడుతున్నాయి. ఆకస్మిత వరదలు ముంచెత్తుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లోనే కాదు ఉత్తరాదిలోనూ ఇదే పరిస్థితి. మధ్య ప్రదేశ్‌లోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నర్మద పొంగుపొర్లుతోంది.
ఆకస్మిక వరదలకు ఇక్కడ ఇప్పటికే 22 మంది చనిపోగా, 9 మంది కనిపించకుండా పోయారు. ఈ ఒక్క రాష్ట్రంలోనే వరదల కారణంగా దాదాపు లక్షమంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటివరకు ఏడువేల మందిని కాపాడినట్లు రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. పలుచోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. భోపాల్‌, సత్నా, గుణ జిల్లాలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. ఇక అసోంలోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలకు ఇద్దరు చనిపోయారు. లక్షమందిని లోతట్టు ప్రాంతాలనుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు. భారీ వర్షాలతో బ్రహ్మపుత్ర నదిలోకి విపరీతమైన వరద వచ్చిచేరుతోంది. దీంతో తీర ప్రాంత గ్రామాలను నదీ ముంచెత్తుతోంది. నది ప్రవాహ తీవ్రతకు మోరిగావ్‌ జిల్లాలోని పొబిటోరా వణ్యప్రాణి సంరక్షణ కేంద్రంలో దాదాపు 60 శాతం ప్రాంతం నీటితో నిండిపోయింది. ఆరు జిల్లాల్లోని 60 గ్రామాల్లో పరిస్థితి సమస్యాత్మకంగా మారింది. రాష్ట్రలో లక్షన్నర మందికి పైగా వరద బాధితులు ఉన్నారు.
మహారాష్ట్ర నందర్బార్‌ జిల్లాలో 24 గంటల్లో 390 మి.మీ. వర్షపాతం నమోదయింది. ఇక్కడ ఇల్లుకూలి నలుగురు చనిపోయారు. నాసిక్‌లో 24 గంటల్లో 1,899 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. గంగాపూర్‌, దర్నా డ్యామ్‌లలో నీటి మట్టం 50 శాతానికి పైగా పెరగడంతో గోదావరి నదిలోకి 22 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సూరత్ నుంచి నందుర్బర్‌కు వెళ్లే రైలు పట్టాలు తప్పడంతో పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. గుజరాత్, వెస్ట్ బెంగాల్‌లోనూ వరదలు లోతట్టు ప్రాంతాలను మంచెత్తాయి. గుజరాత్‌లోని దంగ్‌జిల్లా మొత్తం వరద గుప్పిట్లో చిక్కుకుంది. వెస్ట్ బెంగాల్‌లోని సిలిగురి ప్రాంతాంలోనూ తీవ్రంగా కురుస్తున్న వానలు జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయ్.
హిమాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, రాజస్థాన్‌లోని ఝల్వార్‌, బకని, ఝలరపతన్‌లను భారీ వర్షాలు ముంచెత్తాయి. గోవా, కర్ణాటక, కేరళల్లో రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఋతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా 89 శాతం భూభాగంలో సాధారణ, అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్‌ 1 నుంచి ఈ నెల 10 మధ్య దేశవ్యాప్తంగా 254 మి.మీ వర్షపాతం కురిసినట్లు తెలిపింది. మరో 24గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
« PREV
NEXT »

No comments

Post a Comment