తాజా వార్తలు

Monday, 4 July 2016

సౌదీలో గుళ్లు కడుతుంటే.. ఇక్కడ బాబు కూలుస్తున్నాడు!

ప్రధాని నరేంద్రమోదీ ఆరు నెలల కిందట సౌదీ అరేబియా వెళితే అక్కడ గుడి కట్టాలని స్థలం ఇచ్చారని, ఇక్కడ కృష్ణాతీరంలో సీఎం చంద్రబాబు పురాతనమైన దేవాలయాలను కూల్చివేయిస్తున్నారని హిందూ ఆలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు కమలానందభారతి స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మెదక్ జిల్లాలో ఆలయ భూముల్ని అమ్మివేస్తే తాము చేసిన పోరాటం వల్ల అప్పటి దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణరావుతో రాజీనామా చేయించారని, ఇప్పుడు సదావర్తి భూముల్ని అమ్మితే ఏ మంత్రితో రాజీనామా చేయిస్తారని ప్రశ్నించారు. సత్రాలు, దేవాలయాల భూముల్ని అమ్మే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
విజయవాడలో దేవాలయాల కూల్చివేతకు నిరసనగా హిందూధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం కెనాల్ రోడ్డులో  మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలతో సమావేశం నిర్వహించారు. కమలానందభారతి స్వామి మాట్లాడుతూ... తమ చేతిలో ధర్మదండం, ఒంటిమీద కాషాయవస్త్రం ఉన్నంతవరకు దేవాలయాలను పరిరక్షిస్తామని చెప్పారు. దుర్గగుడికి వెళ్లే దారిలో ఉన్న దర్గానుంచి కొంతస్థలం తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామి తెలిపారు. తాను శివానుగ్రహం పొంది ఉంటే... శివక్షేత్రమే నిజమైతే కేశినేని నాని మరోసారి ఎంపీగా గెలవబోరని శపించారు. ఎంపీ బహిరంగ క్షమాపణ చెప్పాలని, అహ్మద్‌బాబు, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్‌లను సస్పెండ్ చేయాలని విజయనగరం జిల్లా ఆనంద్రాశమం శ్రీనివాసనంద స్వామిజీ డిమాండ్ చేశారు. పుష్కరాలు పూర్తయ్యేలోగా కూల్చిన దేవాలయాలను పునఃనిర్మించాలని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యదర్శి రాఘవులు డిమాండ్ చేశారు.

 దేవాలయాల కూల్చివేత బాధాకరం
 వందల ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయాలను చిన్న ఇళ్లు పీకివేసినట్లు పీకివేయడం బాధాకరమని బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు విమర్శించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కన్నా లక్షీనారాయణ నిర్వహించిన విలేకరుల సమావేశంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దాడి చేయించడం దురదృష్టకరమన్నారు. ఇక నుంచి దేవాలయాలను తొలగించాల్సివస్తే ఆయా కమిటీల పెద్దలతోనూ, స్థానికులతో చర్చించిన తరువాతనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి  హామీ ఇచ్చారని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. పాక్షికంగా కూల్చివేసిన శనైశ్చరస్వామి ఆలయం వద్ద  పుష్కరస్నానం చేసి స్వామిని దర్శనం చేసుకునే విధంగా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.సమావేశానికి ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలు హాజరైనా వేదికను అధిష్టించకుండా కిందే కూర్చున్నారు. సమావేశంలో రాష్ర్టంలో వివిధ పీఠాలకు చెందిన పలువురు స్వామీజీలు, మఠాధిపతులు తదితరులు పాల్గొన్నారు.

 బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
 విజయవాడలో ఆలయాల కూల్చివేతపై సీఎం చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలను అర్ధరాత్రి వేళ కూల్చివేసే అధికారం చంద్రబాబు మంత్రిమండలికి ఎక్కడిదని ప్రశ్నించారు. రిషీకేష్‌లో చాతుర్మాస దీక్షలో ఉన్న ఆయన ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.  ప్రస్తుత పరిస్థితుల్లో చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు పీఠాధిపతులు, మఠాధిపతులతో ప్రభుత్వం సదస్సు  నిర్వహించాలని కోరారు.

 కూల్చివేతపై నివేదిక ఇవ్వండి
 సాక్షి, హైదరాబాద్ : విజయవాడలో పురాతన ఆలయాలను కూల్చి వేయడంపై ఈ నెల 11లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి విజయవాడ మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. విజయవాడలో పురాతన ఆలయాలను చట్ట విరుద్ధంగా కూల్చివేస్తూ ప్రభుత్వం హిందువుల మనోభావాలను గాయపరుస్తోందని న్యాయవాదులు రాజ్‌కుమార్, సీతామాలక్ష్మితోపాటు నగేష్ అనే వ్యక్తి సోమవారం లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment