తాజా వార్తలు

Sunday, 17 July 2016

టర్కీ తిరుగుబాటు బూటకం!

 టర్కీలో జరిగిన సైనిక తిరుగుబాటు బూటకమా? ముందస్తు ప్రణాళికలో భాగంగానే సైనికులు తిరుగుబాటు చేశారా? .. అవుననే అంటోంది సిరియా ప్రభుత్వం. ఈ మేరకు ఆ దేశ అధికారిక పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. మిలటరీ తిరుగుబాటు మొత్తం ఓ పద్ధతి ప్రకారం జరిగిందని అల్-తవ్రా దినపత్రిక పేర్కొంది. అధ్యక్షుడు రెసెప్ తయ్యిపి ఎర్డోగాన్ ప్లాన్‌లో భాగంగానే తిరుగుబాటు జరిగిందని రాసింది. ‘‘ఒకే సమయంలో మిలటరీపై ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు తిరుగుబాటును అణచివేసినట్టు చూపించి ప్రజల మద్దతును మరింత కూడగట్టే ఉద్దేశంతోనే ఆయనీ పనికి పాల్పడ్డారు’’ అని పేర్కొంది. అధ్యక్షుడికి అత్యంత నమ్మకమైన పోలీసులు ప్రజల ముందే సైనికులు అవమానించారని తెలిపింది. పొరుగుదేశమైన సిరియా అధ్యక్షుడు బషర్ అసద్‌ను గద్దె దింపేందుకు ఎర్డోగాన్ తిరుగుబాటుదారులకు మద్దతు పలుకుతున్నారని ఆరోపించింది.
 
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ దేశంలో లేని సమయం చూసుకుని సైనికుల్లో ఓ వర్గం తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. రాజధాని అంకారా, ఇస్తాంబుల్ తదితర నగరాల్లో బాంబులతో సైన్యం విధ్వంసం సృష్టించింది. ఈ ఘటనలో 161 మంది పౌరులు మృతి చెందారు. అయితే ప్రజల సాయంతో అధ్యక్షుడు ఈ తిరుగుబాటును అణచివేసి తిరిగి దేశంపై పట్టుసాధించారు. దాదాపు 3 వేలమంది సైనికులను అదుపులోకి తీసుకున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment