తాజా వార్తలు

Saturday, 2 July 2016

ఏపీ, తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్‌లు…!

తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జ్ లు రాబోతున్నారా? రెండు రాష్ట్రాలకు ఒకే ఇంచార్జితో ఇబ్బందులుపడుతున్నారా?వర్గాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న దిగ్విజయ్ కి ఉద్వాసన చెప్పబోతున్నారా? పీసీసీలలో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఈ మేటర్ నడుస్తోంది.

రాష్ట్రం విడిపోయి రెండేళ్లవుతున్నా తెలుగు రాష్ట్రాల పీసీసీలకు దిగ్విజయ్ సింగ్ నే ఇంచార్జిగా నడిపిస్తోంది ఏఐసీసీ… మొదట్లో ఇబ్బందిలేకున్నా రానురాను ఇది సమస్యగా మారుతోంది. పార్టీలు ఒకటైనా రెండు రాష్ట్రాల్లో స్పందించాల్సిన విషయాలు, స్పందించాల్సిన తీరు వేర్వేరు గా ఉంటున్నాయి. ఒకే ఇంచార్జి తెలంగాణలో ఓ మాట… ఏపీలో మరో మాట మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇది రెండు రాష్ట్రాల పార్టీలకు ఇబ్బందిగా మారింది.

ఈ మధ్య కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు కడుతోందని ఏపీ కాంగ్రెస్ విజయవాడలో ధర్నా చేసింది. అంతకు ముందు కూడా దానిపై ఆందోళనలు చేపట్టింది. విజయవాడ వెళ్లిన దిగ్వి జయ్ ఈ వ్యవహారం మీద మాట్లాడలేపోయారు. అంతకు ముందు హైదరాబాద్ లో దానికి ఆయన మద్దతు పలకాల్సి వచ్చింది. అందుకే ఒక చోట మాత్రమే ఆయన స్పందించగలుగుతున్నారు.

ఇక టీపీసీసీలో దిగ్విజయ్ మీద కొంత మంది నేతలు గుర్రుగా ఉన్నారు. గతంలో లాగా పార్టీపై శ్రద్ధ చూపడంలేదని… కొంత మంది నేతలను గుడ్డిగా ప్రోత్సహిస్తున్నారనే ఫిర్యాదులు ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. డిగ్గీ నేతృత్వంలోనే రాష్ట్రం విడిపోయింది. ఆయన నాయకత్వంలోనే కాంగ్రెస్ జనరల్ ఎన్నికలకు వెళ్లి ఘోరంగా ఓడింది. అలాంటి పార్టీని గాడిలో పెట్టడానికి ఎక్కువ సమయం కేటాయించిన దిగ్విజయ్ పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.

ఏదైనా సమావేశం ఉంటే పొద్దున రావడం… సాయంత్రానికి చెక్కేయడం చేస్తున్నారు. ఇలా కాకుండా పూర్తి కాలం తమకు సమయం కేటాయించే ఇంచార్జిని ఇవ్వాలని కొంత మంది సీనియర్లు మేడమ్ సోనియాను కోరారు. త్వరలో ఎఐసీసీ ప్రక్షాళన జరగబోతోంది. అదే సమయంలో ఏపీ, తెలంగాణ పార్టీలకు కొత్త ఇంచార్జ్ లను నియమించే అవకాశం ఉన్నట్టు ఈ మధ్య ఢిల్లీ వెళ్లి వచ్చిన నేతలు చెబుతున్నారు.

ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ తెలుగు రాష్ట్రాల ఇంచార్జ్ లుగా వస్తారని ప్రస్తుతానికి ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా చూస్తే గులాం నబీ ఆజాద్, వాయిలార్ రవి, దిగ్విజయ్ ఎక్కువ కాలం ఏపీకి ఇంచార్జలుగా ఉన్నారు. ఈసారి కొత్త వారిని పెట్టడం ద్వారా కొత్త ఊపుతేవాలని చూస్తోంది హైకమాండ్.
« PREV
NEXT »

No comments

Post a Comment