తాజా వార్తలు

Saturday, 9 July 2016

‘మేము’ రివ్యూ…

కథ:
మేము సినిమా ఇద్దరు పిల్లల కథాంశంగా రూపొందింది. నవీన్(మాస్టర్ నిశేష్), నైనా(బేబీ వైష్ణవి)లు బాగా అల్లరి చేస్తుంటారు. వీరి అల్లరికే రెండవ తరగతి సమయంలోనే నాలుగు స్కూల్స్ మారతారు. ఇలా ప్రతిసారి వీరి అల్లరి వల్ల స్కూల్స్ మారుతుండటంతో వారి తల్లితండ్రులు వీరిని హాస్టల్లో చేర్పిస్తారు. హాస్టల్లో ఉండటం ఇష్టం లేని నైనా, నవీన్ లు అక్కడి నుంచి బయట పడతారు. దీంతో తమ పరువు పోయిందని భావించిన తల్లితండ్రులు నవీన్-నైనాలను కొడుతున్న సమయంలో డాక్టర్ రామనాథం(సూర్య), అతని భార్య పద్మ(అమలాపాల్) చూస్తారు. స్వతహాగా పిల్లల డాక్టర్ అయినటువంటి రామనాథం ఆ పిల్లలకు ఎలాంటి సమస్య లేదని వారి తల్లితండ్రులకు నచ్చజెప్పి, ఆ తల్లితండ్రులలో మార్పు తీసుకొస్తాడు. అసలు ఆ పిల్లల కోసం రామనాథం, పద్మ ఏం చేసారు? ఆ పిల్లల తల్లితండ్రులలో రామనాధం ఎలాంటి మార్పు తీసుకొచ్చాడు? చివరకు ఏం జరిగింది అనే అంశాలను వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
‘మేము’ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ స్టొరీ లైన్. ప్రేక్షకుల మనసులను హత్తుకునే విధంగా ఈ మేము చిత్రం రూపొందింది. మనసుకు ప్రశాంతంగా, ఆలోచింపజేసే విధంగా ఈ మేము చిత్రాన్ని తెరకెక్కించారు. కథ గురించి సాంకేతికవర్గంలో చర్చించుకుందాం. నటీనటుల విషయానికొస్తే ఇందులో పిల్లలు హైలెట్ గా చెప్పుకోవచ్చు. పిల్లలంతా కూడా వారి వారి పాత్రలలో అధ్బుతంగా నటించారు. ముఖ్యంగా కొన్ని కొన్ని సీన్లలో అదరగొట్టేసారు. సినిమా అంతా కూడా వారిపైనే కొనసాగుతున్నప్పటికీ కథకు తగ్గట్లుగా వారి నటన సెట్ అయ్యింది. ముఖ్యంగా లీడ్ క్యారెక్టర్లు చేసిన పిల్లలు సూపర్. వారి నటనతో ప్రేక్షకులను కట్టిపడేసారు. ఇక బిందు మాధవి, కార్తీక్ కుమార్ లు వారి పాత్రల మేరకు పర్వాలేదనిపించారు. అమలాపాల్ తన పాత్రలో ఒదిగిపోయింది. తన నటనతో ఆకట్టుకుంది.
ఇక మేము సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ సూర్య. చాలా ముఖ్యమైన పాత్రలో నటించి మెప్పించాడు. సినిమాలో సూర్య కనిపించేది కేవలం 40 నిమిషాలే అయినప్పటికీ చాలా చక్కగా చేసాడు. పిల్లలకు టీచర్ గా సూర్య ఆకట్టుకున్నాడు. సూర్య-అమలాపాల్ లు ఇందులో గెస్ట్ రోల్స్ చేసినప్పటికీ వీరే హైలెట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక మిగతా నటీనటులు కథకు తగ్గట్లుగా వారి వారి పాత్రలలో చక్కగా నటించారు.
సినిమా విషయానికొస్తే, ఇలాంటి కథను ముందుగా సినిమాగా తీయడానికి ధైర్యం కావాలి. ప్రస్తుతం కమర్షియల్ సినిమాలా ట్రెండ్ కొనసాగుతున్న ఇలాంటి సమయంలో ఓ చక్కని పిల్లల చిత్రంగా ‘మేము’ రూపొందింది. సినిమా అంతా కూడా ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా నీట్ గా వుంది. మొత్తానికి మనసుకు హత్తుకునే విధంగా బాగుంది.
‘మేము’ సినిమా ప్రస్తుతం ఉన్న జెనరేషన్ ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. ఏదో డాక్యుమెంటరీ ఫిల్మ్ చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇందులో ఎలాంటి కమర్షియల్ వాల్యూస్ ఉన్న అంశాలు లేవు. ప్రేక్షకులు కోరుకునే మాస్, మసాలా, యాక్షన్, రొమాంటిక్ సీన్లు లేకపోవడం. పైగా పూర్తిగా చిన్న పిల్లల కథాంశంతో రూపొందడం వల్ల మాస్ ఆడియన్స్ కు నచ్చకపోవచ్చు. ఈ సినిమా చూస్తుంటే కొన్ని చోట్ల హిందీలో వచ్చిన ‘తారే జమీన్ పర్’ సినిమాలోని సన్నివేశాలు గుర్తొస్తూ ఉంటాయి. ఇదిలా వుంటే సినిమా అంతా కూడా చాలా స్లో నెరేషన్ తో సాగుతుంది. భావోద్వేగాలు, ఎమోషన్స్ ఎక్కువయినట్లుగా అనిపిస్తుంది. కాసేపు ఎంటర్ టైన్మెంట్ కావాలని ఈ సినిమాకు వెళితే మరో కొత్త ఎమోషన్ నెట్టి మీద పడ్డట్లుగా ఫీల్ ఏర్పడుతుంది. కానీ పిల్లల సినిమా అని మెంటల్ గా ఫిక్స్ అయ్యి వెళితే మాత్రం బాగుంటుంది.
సాంకేతికవర్గం పనితీరు :
ముందుగా దర్శకుడు పాండీరాజ్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడున్న తల్లితండ్రులకు అర్థమయ్యే విధంగా పిల్లలపై ఓ చక్కని మెసేజ్ ను అందించాడని చెప్పుకోవచ్చు. సింపుల్ స్టొరీ లైన్ తో చక్కగా ప్రెజెంట్ చేసాడు. స్క్రీన్ ప్లే పర్వాలేదనిపించాడు. నటీనటుల నుంచి ముఖ్యంగా పిల్లల నుంచి మంచి నటనను రాబట్టుకోవడంలో పాండిరాజ్ సక్సెస్ అయ్యాడు. ఇక బాలసుబ్రమణియం అందించిన సినిమాటోగ్రఫీ సూపర్బ్. పిల్లల హావభావాలని చక్కగా చూపించాడు. విజువల్స్ పరంగా ఎమోషన్స్ అన్నిటిని పెర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేసారు. అర్రోల్ కరేల్లీ సంగీతం అందించిన పాటలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను అనుకున్న స్థాయిలో చక్కగా నిర్మించారు.
చివరగా :
‘మేము’ తల్లితండ్రులకు మంచి మెసేజ్…
« PREV
NEXT »

No comments

Post a Comment