తాజా వార్తలు

Sunday, 3 July 2016

రాష్ట్రంలో కుటుంబ పాలనకు చెక్

రాష్ట్రంలో టీఆర్‌ఎస్ కుటుంబ పాలనకు చెక్‌పెట్టేలా బోథ్ నుంచే ఉద్యమాన్ని చేపడుతామని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రైతులు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తామని తెలిపారు. శనివారం నేరడిగొండలోని గార్డెన్స్‌లో బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి జాదవ్ అనిల్‌కుమార్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం అబద్దాల కుటుంబమని విమర్శించారు. నాయకుడంటే వైఎస్.రాజశేఖరరెడ్డిలా ఉండాలని, మాటపై నిలబడాలని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కూతరు కవిత, మేనల్లుడు హరీష్‌రావ్ అందరూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలకు గమ్యాలు ఉండవని, టీఆర్‌ఎస్ చేతిలో తెలంగాణ సమాజం మోసపోయిందని అన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు, నాయకులు అధైర్య పడవద్దని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గండ్రత్ సుజాత మాట్లాడుతూ పాలక పక్షాన్ని గల్లీ నుంచే ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ 2019లో జరిగే ఎన్నికల్లో బోథ్ ఎమ్మెల్యేగా అనిల్‌జాదవ్ ఎన్నికవుతారని జోస్యం చెప్పారు. 33 ఏళ్ల నుంచి బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరకపోవడానికి గ్రూపు విబేధాలే కారణమని, ఇక నుంచి అందరినీ కలుపుకొని పోతామని అన్నారు.
 
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టిన చేవేళ్ల నుంచే ప్రారంభించే వారని, ఇప్పుడు ఇక్కడికి చేవేళ్ల చెల్లమ్మగా పిలువబడుతున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రావడం మన అదృష్టమని పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజనలో శాస్త్రీయత లేదని విమర్శించారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు రవీందర్‌రావు, గంగాభవాని, ప్రేమలత అగర్వాల్, జిల్లా నాయకులు సాజిద్‌ఖాన్, మల్లెపూల సత్యనారాయణ, తిరుమల్‌గౌడ్, రాజుయాదవ్, నేరడిగొండ సర్పంచ్ విజయలక్ష్మి, రోల్‌మామడ ఎంపీటీసీ తొడసం గోదావరి, కార్యకర్తలు పాల్గొన్నారు. సబితాఇంద్రారెడ్డి సమక్షంలో నియోజకవర్గంలోని సుమారు 200 మంది వరకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.

 తెలంగాణ హైకోర్టును వెంటనే  ఏర్పాటు చేయాలి
 నిర్మల్‌టౌన్ : తెలంగాణ హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలని రాష్ట్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. నిర్మల్‌లోని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నివాస భవనంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ఆందోళన చేస్తున్న న్యాయమూర్తులను సస్పెండ్ చేయడం అన్యాయమని అన్నారు. కక్షిదారులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా న్యాయమూర్తులను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయలేదని గుర్తు చేశారు.
 
హైకోర్టు ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు చేపట్టడం లేదన్నారు. 10 మంది ఎంపీలు ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేకపోతుందని విమర్శించారు. హైకోర్టు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌పై సాకులు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోకుండా తగిన ప్రయత్నం చేయాలన్నారు. పార్లమెంట్‌ను స్తంభింపజేసి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సత్యంచంద్రకాంత్, తక్కల రమణారెడ్డి, సాద సుదర్శన్, వెంకట్రారాంరెడ్డి, సుజాత, మేర్వాన్, దినేష్, లింగారెడ్డి పాల్గొన్నారు.

 అంతా వైఎస్ నామస్మరణే
 నియోజక వర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో కార్యకర్త నుంచి నాయకుల వరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చేసిన పనులను కొనియాడారు. రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, విద్యార్థులకు కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం, తదితర అంశాలపై ప్రస్తావించారు. వేదికపై ఉన్న నాయకులు వైఎస్ పేరు చెప్పడంతో అందరూ కరతాళ ధ్వనులు చేశారు. నాయకుడంటే వైఎస్‌లా ఉండాలని, ఇప్పుడు మాయమాటలు చెప్పి కేసీఆర్ ఇప్పటికీ రుణమాఫీ సరిగా చేయలేదని వివరించారు. వైఎస్సార్ చేసిన అభివృద్ధి పనులే ఇప్పుడు జరుగుతున్నాయని తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment