తాజా వార్తలు

Sunday, 3 July 2016

ఎప్పుడు చెప్తారండి!

‘యస్.. ఐయామ్ ఇన్ లవ్’ అని ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన మరు క్షణం నుంచీ పరిశ్రమ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ సమంత ప్రేమ, పెళ్లి గురించి ఒక్కటే చర్చ. ప్రేమలో ఉన్నానని చెప్పారు గానీ, ఎవర్ని ప్రేమిస్తున్నారో మాత్రం చెప్పలేదు. సమంత మనసు దోచిందీ.. ప్రేమిస్తున్నదీ.. అక్కినేని నాగచైతన్యే అని జోరుగా ప్రచారం జరుగుతోంది.

  ఇప్పటివరకూ మూడు చిత్రాల్లో కలసి నటించిన వీరిద్దరూ ఈ ప్రేమ వార్తలపై పెదవి విప్పలేదు. ‘‘చైతన్య నిర్ణయం పట్ల నేను, అమల సంతోషంగా ఉన్నాం. తనను సంతోషపరిచే అమ్మాయిని చూసుకున్నాడు’’ అని ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో నాగార్జున పేర్కొన్నారు. అప్పట్నుంచీ.. త్వరలో చైతు, సమంతల నిశ్చితార్థం జరగనుందనీ, తమిళ చిత్రం ‘వడ చెన్నై’ నుంచి సమంత తప్పుకోవడానికి కారణమిదే అని వార్తలు మొదలయ్యాయి.

 ఈ వార్తలకు కౌంటర్ ఇవ్వాలనుకున్నారో ఏమో.. ‘‘నేను ఏం చేస్తానో.. ఎందుకు చేస్తానో.. నాకు తెలుసు. మీకు తెలియాలంటే నేనే చెప్పాలి. నేను చెప్పినప్పుడే మీకు తెలుస్తుంది’’ అని శనివారం ఉదయం సమంత ట్వీట్ చేశారు. నిజమే.. ఎవర్ని ప్రేమిస్తున్నారో? నిశ్చితార్థం ఎప్పుడో? పెళ్లి ఎప్పుడో? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమంతే సమాధానం చెప్పాలి. ప్రేక్షకులు, అభిమానులు తెలుసుకోవాలి. సమంత గారూ... మీకు తెలిసిన విషయాలు మాకు ఎప్పుడు చెప్తారండీ!!
« PREV
NEXT »

No comments

Post a Comment