తాజా వార్తలు

Sunday, 3 July 2016

టీవీ చానళ్లకు ప్రధాని వార్నింగ్

ఉగ్రవాదుల దాడి సందర్భంగా బంగ్లాదేశ్ టీవీ చానళ్లు ప్రదర్శించిన అత్యుత్సాహంపై ప్రధాని షేక్ హసినా మండిపడ్డారు. టీవీ చానళ్ల లైసెన్సులు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. పలువురిని బందీలుగా పట్టుకున్న ఐసిఎస్ ముష్కరులను మట్టుబెట్టెందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను టీవీ చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి.
'ఉగ్రవాదుల చెర నుంచి  బందీలను విడిపించేందుకు మేము చేపట్టిన ఏర్పాట్లను వార్తా చానళ్లు లైవ్ ప్రసారం చేశాయి. ఈ ప్రసారాలు ఉగ్రవాదులు చూస్తారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. తమను అంతం చేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుందో తెలిస్తే ఉగ్రవాదులు తప్పించుకునే అవకాశముంటుంది. ఇలాంటి వ్యవహారాల్లో సంయమనం పాటించాలని వార్తా చానళ్ల యజమానులను కోరుతున్నా'నని హసినా అన్నారు. శనివారం సైనిక చర్య ముగిసిన కొద్దిసేపటికే ప్రధాని షేక్ హసీనా టెలివిజన్ ప్రసారంలో ప్రసంగించారు. సైనిక చర్య సందర్భంగా టీవీ చానళ్లు వ్యవహరించిన తీరును ఆమె విమర్శించారు.

'అమెరికాలో ఇలాంటి దాడులు జరిగినప్పుడు సీఎన్ఎన్ లేదా బీబీసీ ప్రభుత్వ చర్యలను పక్షపాతంతో చూపిస్తాయా? కానీ మన దేశంలో టీవీ చానళ్ల మధ్య ఎక్కువ ఉండడంతో అత్యుత్సాహం ప్రదర్శించాయి. ఇదేమి చిన్న పిల్లల ఆట కాదు. మా ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చింది. వాటిని రద్దు చేసే అధికారం కూడా మాకుంది. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరముంద'ని హసినా పేర్కొన్నారు.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని  హోలీ ఆర్టిసన్ బేకరీ రెస్టారెంట్‌లో విదేశీయులను బందీలుగా పట్టుకున్న ఉగ్రవాదులు ఒక భారతీయ యువతి సహా 20 మందిని అత్యంత కిరాతకంగా నరికి చంపారు. భద్రతాబలగాలు 10 గంటల పాటు సైనిక చర్య జరిపి ఆరుగురు ఉగ్రవాదులను తుదముట్టించాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment