తాజా వార్తలు

Tuesday, 12 July 2016

టీఆర్‌ఎస్... అధికార దుర్వినియోగం


టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, టీడీపీ శాసనసభా పక్షానికి కేటాయించిన కార్యాలయాన్ని దురాక్రమణ చేసిందని టీటీడీపీ నేతలు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన టీఆర్‌ఎస్‌పై.. పరి శీలించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీ టీడీపీ నేతలు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి ఈ మేరకు ఒక విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పార్టీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
గత 2014 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ 15 మంది సభ్యులను గెలిపించుకోగా, అధికార పార్టీ ప్రలోభపెట్టి 12 మందిని తమ పార్టీలో చేర్చుకుందన్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో ఫిర్యాదు చేశామని, విచారణ కొనసాగుతోందని, ఇంతలోనే టీ టీడీఎల్పీ కార్యాలయాన్ని, 107, 110 గదులను దురాక్రమణ చేసిందన్నారు. ఈ ఘటనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని, టీ టీడీఎల్పీ కార్యాలయాన్ని టీడీపీకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
« PREV
NEXT »

No comments

Post a Comment