తాజా వార్తలు

Saturday, 2 July 2016

నాగంపై దాడికి ‘టీఆర్‌ఎస్’ యత్నం

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని కోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డిపై శనివారం మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడిచేయడానికి యత్నిం చారు. నాగం నిర్వహిస్తున్న మీడియా సమావేశంలోకి చొచ్చుకువచ్చిన ఆందోళనకారులు ఆర్‌అండ్‌బీ విశ్రాంత భవనంలోని కిటికీ అద్దాలు, ముఖద్వారం తలుపును ధ్వంసం చేశారు. పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా.. సమావేశం హాల్లోకి వచ్చి నాగంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. టీఆర్‌ఎస్ కార్యకర్తలు నాగంపై విమర్శల వర్షం కురిపించారు.  బీజేపీ కార్యకర్తలు నాగంకు రక్షణ వలయంగా ఏర్పడి.. కేసీఆర్ డౌన్ డౌన్! అంటూ ప్రతి నినాదాలు చేశారు.  
 తెలంగాణ రజాకార్ల సంఘంగా టీఆర్‌ఎస్: నాగం
 తాటాకు చప్పుళ్లకు తాను బెదిరేది లేదని నాగం అన్నారు. జిల్లా మంత్రుల ప్రోత్సాహంతోనే టీఆర్‌ఎస్ కార్యకర్తలు తనపై దాడి చేయడానికి పూనుకుంటున్నారని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టు పనుల్లో  ఆంధ్రా ప్రాంత అవినీతి కాంట్రాక్టర్లతో ఉన్న అనుబంధం ఎక్కడ వెలుగులోకి వస్తుందోనన్న భయంతోనే.. ప్రభుత్వం తనపై దాడికి దిగుతోందని విమర్శించారు. సీఎం కేసీఆర్ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని, అన్ని పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని శాసనవ్యవస్థను నాశనం చేస్తున్నారన్నారు. గ్రామాలు, మండలాల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు ‘తెలంగాణ రజాకార్ల సంఘం’గా మారి అరాచకాలు, అకృత్యాలకు ఒడిగడుతున్నారని ఆరోపించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment