తాజా వార్తలు

Friday, 8 July 2016

రాష్ట్రంలో బీజేపీ మిషన్-2019

తెలంగాణలో 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు పిలుపునిచ్చారు. మిషన్-2019 లక్ష్యంగా ముందుకువెళ్లాలని దిశానిర్ధేశం చేశారు. 2019లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన ఇక్కడ బీజేపీ తెలంగాణ కోర్ కమిటీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ నాయకులు మురళీధర్‌రావు, రామ్‌మాధవ్, సౌధాన్ సింగ్, రాంలాల్‌తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, సీనియర్ నేతలు కిషన్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు, ఎన్.రామచంద్రరావు, మంత్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో పార్టీ బలోపేతానికి గతంలో ఖరారుచేసిన రోడ్‌మ్యాప్ ఎంతవరకు అమలైంది?  కేంద్రం నుంచి ఎలాంటి సాయం అవసరం? రాష్ట్రం ఏం ఆశి స్తోంది? తదితర అంశాలపై సమీక్ష నిర్వహిం చారు. ముఖ్య నేతలందరూ జవాబుదారీగా పనిచేస్తేనే అధికారం దక్కుతుందని షా హితబోధ చేశారు. 2019లో అధికారంలోకి రావడానికి అవసరమైన కార్యాచరణను వివరిం చారు. తెలంగాణలో బీజేపీకి మంచి భవి ష్యత్తు ఉందన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నేతలు తెలంగాణలో రాజకీయ, పాలనాపరమైన పరిస్థితులు వివరించారు. రాష్ట్రం కుటుంబ పాలనలో ఉందని, అడ్డదారుల్లో ఇతర పార్టీల నుంచి నేతలను తెచ్చుకుని బలం చూపెట్టుకుంటూ తమ తప్పిదాలను కప్పిపెడుతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో పోరాటానికి సన్నద్ధం కావాలని అమిత్‌షా వారికి పిలుపునిచ్చారు.

 సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం..
 సెప్టెంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలని అమిత్‌షా పార్టీ నేతలకు సూచించారు. టీఆర్‌ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సెప్టెంబర్ 17ను పక్కన పెట్టిందని రాష్ట్ర నేతలు అమిత్‌షాకు వివరించారు. తెలంగాణలో ప్రస్తుతం పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని, పల్లెపల్లెకూ బీజేపీని చేర్చాలని అమిత్‌షా నేతలకు చెప్పారు. పార్టీలో చేరికలను ప్రోత్సహించాలని, హైదరాబాద్‌లో ఉగ్రవాద ప్రాబల్యం పెరుగుతున్నందున ‘సేవ్ హైదరాబాద్’ పేరుతో ప్రచారం నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు సమాచారం.

 అక్టోబర్‌లో రాష్ట్రానికి ప్రధాని
 అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, సీనియర్ నేతలతో కలసి మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్‌లో అమిత్‌షా రాష్ట్రానికి వస్తారని, పార్టీ క్షేత్రస్థాయి యంత్రాంగంతో మాట్లాడతారని చెప్పారు. అలాగే అక్టోబర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో సమస్యలపై సమష్టిగా పోరాడి 2019లో అధికారంలో వస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. మరోవైపు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, పలువురు బీజేపీ నేతలు, న్యాయవాదులు హైకోర్టు విభజన అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిశారు. హైకోర్టు విభజన, న్యాయాధికారుల కేటాయింపుల వివాదాన్ని పరిష్కరించడంలో చొరవ చూపాలని కోరారు.
« PREV
NEXT »

No comments

Post a Comment