తాజా వార్తలు

Sunday, 16 October 2016

ప్రధాని నవాజ్‌కు 5 రోజులు గడువిచ్చిన పాక్‌ సైన్యం!

పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలున్నట్లు ‘డాన్’ పత్రికలో వచ్చిన కథనం తీవ్ర స్థాయిలో అలజడి సృష్టిస్తోంది. శుక్రవారం కార్ప్స్ కమాండర్ల సమావేశం ముగిసిన తర్వాత సైన్యం నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి హెచ్చరిక సంకేతాలు పంపించింది. ఈ నెల 3న జరిగిన కీలక సమావేశానికి సంబంధించిన రహస్య వివరాలను ‘డాన్’ ప్రతినిధి సిరిల్ అల్మీదాకు పీఎంఓలో ఉన్నవారే ఇచ్చి ఉంటారని, ఆ వ్యక్తి ఎవరో 5 రోజుల్లోగా బయటపెట్టాలని స్పష్టం చేసింది. అదే సమయంలో ‘డాన్’ కథనం కల్పితమని, తప్పు అని ప్రకటించింది. ఈ కథనం దేశ భద్రతకు ప్రమాదకరమని చెప్తున్న సైన్యం... తప్పుడు సమాచారం వల్ల ఏ విధంగా హాని జరుగుతుందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే పాక్ పీఎంఓ సిరిల్ అల్మీదాను ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్‌లో పెట్టింది. దీనిపై అంతర్జాతీయంగా అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
 
సిరిల్ అల్మీదా రాసిన కథనంలో అత్యంత సూక్ష్మమైన వివరాలు ఉన్నాయి. వాటిని ఆ పత్రిక సంపాదకుడు కూడా సమర్థించారు. తాము మళ్ళీ మళ్ళీ సరిచూసుకొని ఈ కథనాన్ని ప్రచురించామని స్పష్టం చేశారు. అయితే ఈ కథనం నవాజ్ షరీఫ్‌కు ఆయన సోదరుడు, పంజాబ్ ముఖ్యమంత్రి షహబాజ్ షరీఫ్‌కు అనుకూలంగా, సైన్యానికి వ్యతిరేకంగా ఉందని ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ మండిపడుతున్నారు. అన్నదమ్ములిద్దరూ ఉగ్రవాదులను కటకటాల్లోకి నెట్టే యోధులుగా ఈ కథనంలో చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment