తాజా వార్తలు

Monday, 3 October 2016

పునర్నిర్మాణం దిశగా టీజేఏసీ

తెలంగాణ జేఏసీ పునర్నిర్మాణంపై దృష్టిని కేంద్రీకరించింది. తన విధానాలు, ఆలోచనలు, కార్యాచరణను క్షేత్రస్థాయి వరకు చేర్చడానికి వివిధ మీడియాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. తెలంగాణ పునర్నిర్మాణంలో జేఏసీ నిర్వహిస్తున్న పాత్రను క్షేత్రస్థాయిలో ప్రచారం చేసుకుంటూనే గ్రామస్థాయి దాకా విస్తరించాలని నిర్ణయించింది. దీనికోసం ముందుగా వివిధ సంఘాలను జేఏసీలో భాగం చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. జేఏసీలో భాగం కావాలనే యోచనతో ఉన్న ఉద్యోగ, కార్మిక, సామాజిక, ప్రాంతీయ, న్యాయవాద, జర్నలిస్టు, సాంస్కృతిక సంఘాలను ఇప్పటికే గుర్తించింది. అన్ని సంఘాలు చేరిన తర్వాత రాష్ట్రస్థాయిలో స్టీరింగ్ కమిటీని ఏర్పాటుచేయనున్నారు. ఈ స్టీరింగ్ కమిటీ నేతృత్వంలోనే జిల్లా కమిటీలు, నియోజకవర్గ, మండల కమిటీల నిర్మాణానికి చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్రస్థాయిలో రైతు పోరాటాలు, యువతకు ఉపాధి అవకాశాలపై దృష్టిని కేంద్రీకరించి పలు కార్యక్రమాలను చేపట్టనుంది.

ప్రత్యేక బులెటిన్, ఫేస్‌బుక్, వాట్సప్, వెబ్‌సైట్‌ల ద్వారా తన కార్యాచరణను క్షేత్రస్థాయిలోకి తీసుపోవాలని టీజేఏసీ నిర్ణయించింది. నెలకోసారి ఒక ప్రత్యేక బులెటిన్‌ను సంఘాలకు అందించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నది. తెలంగాణరాష్ట్రంలోని సమస్యలు, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వాటికి టీజేఏసీ చూపించే ప్రత్యామ్నాయాలు వంటివాటిపై వీటిలో విశ్లేషణలు ఉంటాయి. ఆయా రంగాల్లో నిపుణులైన వారి విశ్లేషణలను బులెటిన్‌ల ద్వారా, వెబ్‌సైట్ల ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిని ఫేస్‌బుక్, వాట్సప్ ద్వారా ప్రచారం చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని జేఏసీ నిర్ణయించి నట్లు తెలిసింది.
« PREV
NEXT »

No comments

Post a Comment