తాజా వార్తలు

Wednesday, 5 October 2016

కాంగ్రెస్ పాలనలో.. రైతే రాజు

 
కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ పాలనలో రైతే రాజులా పాలన సాగించి రైతులను ఆదుకుందని, కానీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్‌ను రాజు ను చేసి పాలన సాగిస్తోందని టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట, బాలానగర్ మండలాల్లోని పలు గ్రామాల్లో అతివృష్టి, అనావృష్టితో ఎండిపోయిన పంటలను టీపీసీసీ బృందం పరిశీలించింది.

 
ఆయా చోట్ల ఉత్తమ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, కాకతీయ పథకాలకు నిధులు ఖర్చు చేస్తూ రైతులను విస్మరించిందన్నారు. మిషన్ పథకాల కాంట్రాక్టర్‌లపై ఉన్న ప్రేమ  రైతులపై లేదని ఆరోపించారు. ఎన్నికల సందర్భంలో రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చి.. నాలుగు విడతల్లో మాఫీ చేస్తామంటూ మాయమాటలు చెప్పారన్నారు. రెండేళ్లు గడిచినా మూడో విడత మాఫీ జరగలేదన్నారు. పాలమూరు జిల్లాలో పంటలను పరిశీలించి పంట నష్టం అంచనా వేయాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇవ్వకపోవడంతో విడ్డూరమన్నారు.
 
ఈ విషయంలో సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తున్నట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు.  పంటలను పరిశీలించిన వారిలో గద్వాల, వనపర్తి ఎమ్మెల్యేలు డీకే అరుణ, చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ మీడియా కో-కన్వీనర్ బండి సుధాకర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.  

ఒక్క గ్రూప్‌కూ 15 లక్షల రుణమివ్వలేదు
తెలంగాణ గవర్నమెంట్ వస్తే మహిళాగ్రూపులకు రూ.15 లక్షలవరకు వడ్డీలేని అప్పులిస్తామన్నారు. కానీ ఏ ఒక్క గ్రూప్‌నకు రూ.15 లక్షల రుణాలు బ్యాంకులు ఇవ్వలేదు’ అని బాలానగర్ మండలం మల్లేపల్లి గ్రామ శివారులో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బృందానికి ఆ గ్రామ మహిళా రైతులు అంజమ్మ, మంజుల, లక్ష్మి వివరించారు. ‘రాజశేఖరరెడ్డి సారు ఉన్నప్పుడు బ్యాంకుల్లో మేము తీసుకున్న రుణాలు అన్ని ఒకేసారి మాఫీ చేసిండ్రు. ఇప్పుడేమో ఒక్కరికి రూ.లక్ష వరకే అన్నారు. అది కూడా నాలుగు విడతలన్నారు. ఒక్కసారి ఇచ్చిండ్రు’ అంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment