తాజా వార్తలు

Saturday, 19 November 2016

అనంతలో ఉద్యోగిని చితకబాదిన సీఐ అసలు బాగోతం ఇదే

ఆది నుంచి సీఐ గోరంట్ల మాధవ్‌ది దూకుడే స్వభావమే. చార్జ్‌మెమోలు... సస్పెన్షన్లు ఆయనకు కొత్తేమీ కాదు. పోలీసు వ్యవస్థలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ఆయన తహతహలాడుతుంటారు. ఆ దిశగానే విధి నిర్వహణలోనూ దూకుడుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారమా... ప్రతిపక్షమా అని చూడకుండా ఎవరిపైనైనా ఒకే స్టైల్‌లో కోటింగ్‌ ఇస్తూ... వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ వస్తున్నారు. లాఠీ ఝుళిపిస్తే తప్పా దారిలోకి రారన్న స్వభావం అయనదన్న అభిప్రాయాలున్నాయి. తన దృష్టిలో తప్పని అనుకుంటే... చితకబాదడమే ఆయన నైజం. ఈ క్రమంలో ఆయన ఎక్కడ పని చేసినా మెప్పులు... విమర్శలు సముపాళ్లల్లో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి దాకా డజన్‌కుపైగా చార్జ్‌మెమోలు జారీ అయినట్లు పోలీసు వర్గాలు ద్వారా అందిన సమాచారం. మరో 10 దాకా ప్రైవేటు కేసులున్నాయి. ఎస్‌ఐగా విధులు నిర్వర్తించిన తొలి రోజుల్లోనే రెండు మార్లు సస్పెండ్‌ అయ్యారు. ఇప్పటి దాకా రెండు సార్లు వీఆర్‌కు వెళ్లారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు చెందిన గోరంట్ల మాధవ్‌ 1998లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పోలీసు శాఖలో చేరారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం పరిధిలోని మన్నూరు, మైలవరం పోలీసు స్టేషన్లల్లో దాదాపు మూడు సంవత్సరాలపాటు ఎస్‌ఐగా పనిచేశారు.

ఓ బాలిక హత్య కేసు వివాదాస్పదం నేపథ్యంలో గోరంట్ల మాధవ్‌ సస్పెండ్‌ అయినట్లు సమాచారం. అదే ప్రాంతంలో మరో సారి తన దూకుడు స్వభావం నేపథ్యంలో మరోసారి సస్పెన్షనకు గురయ్యారు. ఆ తర్వాత అనంతపురం జిల్లాకు బదిలీపై వచ్చారు. పరిగి, అనంతపురం వన్‌టౌన్‌, గుత్తిలో ఎస్‌ఐగా విధులు నిర్వర్తించారు. 2012లో సీఐగా పదోన్నతి లభించింది. సీఐ హోదాలో పీసీఆర్‌లో పనిచేశారు. ఆ తర్వాత వీఆర్‌లో ఉన్నారు. ఆ సమయంలోనే అప్పటి అధికార పార్టీ ముఖ్యనేతల ఆశీస్సులతో అనంతపురం వన్‌టౌన్‌ సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఏడాదిన్నర తిరక్కముందే ఓ రాజకీయ వివాదంలో ఆయన్ని వీఆర్‌కు పంపారు. ఆరు నెలల తర్వాత అంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధి సహకారంతో అనంతపురం నగర త్రీటౌన్‌ సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఆరు నెలలు గడవకముందే తాజా ఘటన నేపథ్యంలో గోరంట్ల మాధవ్‌ను వీఆర్‌కు పంపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment