తాజా వార్తలు

Thursday, 5 January 2017

ఎఫ్‌ఆర్‌బీఎం పెంచమనటం.. కమీషన్ల కోసమే!

ఏపీ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం (ఫిజికల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌)చట్టంలో జీఎస్‌డీపీపై ఉన్న పరిమితిని మూడు నుంచి నాలుగు శాతం పెంచమని కేంద్రాన్ని కోరటంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అభ్యంతరం తెలిపారు. కేంద్రం నుంచి అప్పులు తీసుకొచ్చి కమీషన్ల కొట్టేయాలనే ఉద్దేశంతోనే పరిమితిని పెంచాలని కోరుతోందని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడారు. వాస్తవానికి ఉన్న జీఎస్‌డీపీపై మూడు శాతం పరిమితి వరకు రుణాలు తీసుకోవచ్చని, దాన్ని నాలుగు శాతం పెంచమని కోరటం వెనుక కమీషన్ల కుట్ర ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర గణాంకాలను మార్చి ప్రచారం చేసి ఎక్కువ అప్పులు తీసుకువచ్చి ఎక్కువ పనులు ద్వారా కమీషన్లు కాజేయాలనే ఏకైక దృక్పథంతో చంద్రబాబు, యనమలలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతూ, వ్యవస్థల్ని మేనేజ్‌ చేస్తున్నారని మండిపడ్డారు.

గతంలోనే ఈ గణాంకాలను నమ్మబోమని ఆర్బీఐ చెప్పడంపై ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు.
మతి భ్రమించిన బాబు: దేశంలోనే సీనియర్‌ రాజకీయవేత్తకి మతి భ్రమించిందని, నోబెల్‌ బహుమతి సాధిస్తే వంద కోట్లు ఇస్తామనడమే ఇందుకు నిదర్శనమని అంబటి విమర్శించారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా అవకాశాలు, వసతులు కల్పించాలని హితవు పలికారు. నోబెల్‌ గురించి 2015 ఫిజిక్స్‌లో నోబెల్‌ విజేత, జపనీస్‌ శాస్త్రవేత్త తక్కాకి కజితను చంద్రబాబు సలహా కోరితే.. వర్క్‌హార్డ్‌ అని చెప్పారని తెలిపారు. మంచి పనులు ఎలాగూ చేయలేమని చంద్రబాబుకు అర్థమైందేమో.. వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో ఉండాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మగాళ్లు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే రోజులు వస్తాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలోని 50 వేల పాఠశాలల్లో రోజూ గంట పాటు పాఠాలు బోధించాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లే ఆయన ఉపన్యాసాలను తట్టుకోలేకపోతున్నారని, ఇక రోజూ గంట పాటు క్లాస్‌ తీసుకుంటే చిన్నపిల్లలు ఏమైపోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలన్నింటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలని అంబటి డిమాండ్‌ చేశారు.

« PREV
NEXT »

No comments

Post a Comment