తాజా వార్తలు

Monday, 17 April 2017

లేడీ కిలాడీ లీలలు చూసారా?

డబ్బున్న యువకులే ఆమె టార్గెట్‌. చాటింగ్‌లతో మతి పోగోడుతుంది. ఆకట్టుకునే క్యాప్షన్లతో పరిచయం పెంచుకుంటుంది. వాట్సాప్‌ అంటూ గంటల పాటు తనతో మాట్లాడేలా చేస్తుంది. మరో అమ్మాయి పోటో చూపించి మాయ చేస్తుంది.

ఈమె పేరు కనకమహాలక్ష్మి. పేరు గౌరవ ప్రదంగా ఉన్నా... బుద్ధి మాత్రం వక్రం. పక్కా 420. చూడ్డానికి సాదాసీదాగా కనిపించినా... కుర్రాళ్ల హార్ట్‌ కొళ్లగొట్టడంలోనే కాదు.. వారికి కుచ్చుటోపీ పెట్టడంలోనూ మహాముదురు. ఈ లేడీకిలాడీ లీలలు వింటే ఎవ్వరైనా కంగుతినాల్సిందే. ఇష్క్‌ అంటూ కవ్విస్తుంది.. రిస్క్‌ తీసుకున్నవారికి దిమ్మతిరిగే షాక్‌ ఇస్తుంది. ఫేస్‌బుక్‌లో అబ్బాయిలను బుక్‌ చేయడంలో దేశముదురు.

హైదరాబాద్‌ విప్రోలో ఉద్యోగం చేస్తున్న ఈపురుపాలెం గ్రామానికి చెందిన సురేష్‌ను ఆకట్టుకునే చాటింగ్‌తో ముగ్గులోకి దింపింది. అందంగా ఉండే ఓ యువతి ఫోటో ప్రొఫైల్‌తో చల్లా మౌనిక పేరుతో సురేష్‌కు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపింది. చాటింగ్‌తో మొదలైన వ్యవహారాన్ని.. ఫోన్లో గంటలపాటు మాట్లాడే స్థాయికి తీసుకెళ్లి ప్రేమమత్తులో ముంచింది. విషయం పెళ్లి దాకా రావడంతో.. తన తండ్రి ఒంగోలు సీసీఎస్ డీఎస్పీ అని..తన ఇద్దరు బ్రదర్స్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు అని కోతలు కోసింది.

ఆ తర్వాత మన పెళ్లికి ఇంట్లో ఒప్పుకోవడం లేదని.. అందుకే నిద్రమాత్రలు మింగానంటూ వాట్సాప్‌లో వీడియో పోస్టు చేసి షాకిచ్చింది. ఇది నిజమేనని నమ్మిన సురేష్‌..మౌనిక తన తండ్రిగా చెప్పిన ఒంగోలు సీసీఎస్‌ డీఎస్పీకి మేసేజ్‌ పంపడంతో..ఆమె బండారం బయటపడింది. దీంతో ఆరా తీయగా ఆమె.. ప్రకాశం జిల్లా చీరాల రామనగర్‌కు చెందిన కనకమహాలక్ష్మి అని తెలిసింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ఓ హోటల్‌కు రమ్మని మళ్లీ సురేష్‌ను ట్రాప్‌ చేసింది. ఆ తర్వాత డబ్బులు కావాలంటూ బ్లాక్‌ మెయిల్‌ చేసింది.

ఇక లేడీ కిలాడీకి యువకులను మోసగించడం కొత్తేమి కాదని తెలుస్తోంది. వైజాగ్‌కు చెందిన ఓ వ్యాపారిని లోబరుచుకుని అతడి నుంచి 20 సవర్ల బంగారం నొక్కేసినట్లు సమాచారం. అటు తిరుపతిలో ఈ మాయలేడిపై 2005లో మూడు కేసులున్నాయి. నార్కట్‌పల్లిలో ఓ చోరీ కేసులో నిందితురాలు. అయితే అటు కనకమహాలక్ష్మి.. ఇటు సురేష్‌ ఫిర్యాదులపై విచారణ చేపట్టిన పోలీసులు.. నిజా నిజాల నిగ్గు ఏంటో తేల్చే పనిలో పడ్డారు.
« PREV
NEXT »

No comments

Post a Comment