తాజా వార్తలు

Wednesday, 12 April 2017

ఆవులు సరే, ఆడవాళ్ళ పరిస్థితేంటి??

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎవరైనా చంపితే 11 లక్షలు ఇస్తానంటూ బీజేపీ యువనేత చేసిన ప్రకటన పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించింది. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్‌ రాజ్యసభలో తీవ్రంగా మండిపడ్డారు. ’మీరు ఆవులను కాపాడతామని చెబుతున్నారు గానీ మహిళల సంగతేంటి’ అని ఆమె ప్రశ్నించారు. బీజేవైఎం నేత యోగేష్‌ వర్ష్నే ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీర్భూమ్‌ నగరంలో హనుమాన్‌ జయంతి ర్యాలీ మీద ముఖ్యమంత్రి ఆంక్షలు విధించడంతో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ర్యాలీలో పాల్గొన్న వారిపై లాఠీ చార్జి చేయించారని చెబుతూ మమతా బెనర్జీని దెయ్యం అని అభివర్ణించారు.

ఈ విషయమై పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి ప్రకటనలను తాను కూడా ఖండిస్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు. ఆయన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు. అయితే జయాబచ్చన్‌ మాత్రం ఆయన సమాధానంతో సంతృప్తి చెందలేదు. మహిళల గురించి ఎవరైనా అలా మాట్లాడటానికి ఎంత ధైర్యం ఉండాలని ప్రశ్నించారు. దేశంలో మహిళలను రక్షించే తీరు ఇదేనా అని నిలదీశారు. మహిళలు తీవ్ర అభద్రతా భావంతో ఉన్నారని ఈ పరిస్థితిని ఎప్పటికి సరిచేస్తారని అన్నారు.

అయితే దీనికి బీజేపీ సభ్యురాలు రూపా గంగూలీ దీటుగా సమాధానమిచ్చారు. తాను కూడా మహిళనేనని, తనను పోలీసుల ఎదురుగానే కొంతమంది కొట్టారని, దీనికి బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమాధానం ఇస్తారా అని ప్రశ్నించారు. ఆ తర్వాత తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు సభలో తీవ్రస్థాయిలో నిరసనలు తెలిపారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని దెయ్యం అంటున్నారని, రాష్ట్రంలో మతం పేరుతో అరాచకం కొనసాగుతోందని, దీన్ని అందరూ ఖండించాలని పార్టీ ఎంపీ సుఖేందు శేఖర్‌ అన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment