తాజా వార్తలు

Thursday, 13 April 2017

కేసీఆర్‌ వరం: రైతులకు ఉచితంగా ఎరువులు

రాష్ట్రంలో నవ శకానికి నాంది పలకబోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రగతిభవన్‌లోని జనహితలో రైతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించామనీ, వచ్చే ఆర్థిక ఏడాది నుంచి తెలంగాణలో రైతులకు 24లక్షల టన్నుల ఎరువుల నూటికి నూరు శాతం ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై ప్రధానంగా దృష్టిసారించినట్టు చెప్పారు. దేశంలోనే 21శాతం ఆదాయం పెరిగిన రాష్ట్రంగా తెలంగాణ నేడు ఆవిర్భవించిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 55లక్షల మంది రైతులు ఉన్నారనీ వారందరికీ ఉచితంగా ఎరువులు సరఫరా చేయనున్నట్టు చెప్పారు. సీఎం ప్రకటనకు అక్కడ ఉన్న రైతులంతా లేచి ఒక్కసారిగా నినాదాలు చేశారు. ఒక రైతు బిడ్డగా తాను తెలంగాణ రైతాంగానికి చేస్తున్న సేవ అన్నారు. ఇలా ఎన్నో రకాలుగా రైతుల్ని ఆదుకుంటే తప్ప బంగారు తెలంగాణ సాధ్యం కాదన్నారు. గ్రామాల్లో సంపదను సృష్టిస్తేనే అభివృద్ధిలో ముందుకెళ్లగలమన్నారు. తెలంగాణ ఉన్నంతవరకు ఎరువులు ఉచితంగా సరఫరా అయ్యేలా చేస్తానన్నారు. రాష్ట్రంలో ఎన్ని మంచి పనులు చేస్తామన్నా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.
కోటి ఎకరాలకు నీరిందించి తీరుతా 
తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నట్టుగానే కోటి ఎకరాలకు నీరు అందించి తీరుతానన్నారు. మూడు నాలుగేళ్లలోనే నీరు అందించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రజల్ని అభివృద్ధి పథంలో వుంచితే తమకు డిపాజిట్లు కూడా దక్కవని కొందరు బాధపడుతున్నారని, నానా మాటలు అంటున్నారని చెప్పారు. గ్రామాల్లో క్రాప్‌ కాలనీలు రావాల్సి ఉందని, గిట్టుబాటు ధర అప్పుడే సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ క్రాప్‌ కాలనీలుగా విభజన చెంది అద్భుతమైన పంటలు పండాలని ఆకాంక్షించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment