తాజా వార్తలు

Thursday, 13 April 2017

మంత్రిగారి రోజు కూలి అక్షరాలా రూ.3లక్షలు

మంత్రి జగదీశ్‌రెడ్డి మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో హమాలీ అవతారమెత్తారు. బస్తా మూటలు మోసి, అట్టపెట్టలను లారీలో ఎక్కించి అక్షరాలా రూ.3 లక్షలు సంపాదించారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నిధుల సమీకరణ కోసం నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి నెత్తికి రుమాలు చుట్టుకొని బుధవారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని విస్తా ఫార్మాస్యూటికల్‌ లిమిటెడ్‌, ఐడియల్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ కంపెనీల్లో హమాలీ పని చేశారు. ప్రజాప్రతినిధుల కష్టానికి మెచ్చిన విస్తా కంపెనీ యాజమాన్యం రూ.లక్ష, ఐడియల్‌ కంపెనీ యాజమాన్యం రూ.2 లక్షల కూలి ముట్టజెప్పింది.
పొట్టకూటి కోసం కూలీ పని చేసువారికి పదో పరకో ఇస్తుంటాయి కంపెనీలు. అయితే ఇదంతా పేదవాళ్లకు మాత్రమే. పెద్దోళ్లకు మాత్రం లక్షల్లో కూలీ ఇస్తారు. టీఆర్‌ఎస్ ప్లీనరీకి నిధులు సమకూర్చడానికి రోజువారి కూలీగా మారారు మంత్రి జగదీష్‌రెడ్డి. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి అక్షరాలా జనం ఓట్లేసి గెలుచుకున్న ప్రజాప్రతినిధి. ఈయనకేం కష్టమొచ్చిందబ్బా ఇలా పనిచేస్తున్నారు అనుకుంటున్నారా కంపెనీల్లో కూలీలు పాపం రోజు ఎంత కష్టపడి పనిచేస్తున్నరో ఏమో ఆ కష్టం తాను కూడా తెల్సుకోవాలి అని ఆ పెద్ద మనిషి అనుకున్నారని మీరనుకుంటే పొరపాటే. త్వరలో జరగబోయే టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీకి నిధులు సమకూర్చుకోవడానికి కూలిగా అవతారమెత్తారు తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి. నల్గొండ జిల్లాలోని నార్కెట్‌పల్లి మండలంలో ఓ రెండు కంపెనీల్లో రోజువారి కూలీలతో కలిసి పనిచేశారు. ఇందుకుగాను అక్షరాలా 3 లక్షల రూపాయలు చెక్కు అందుకున్నారు. ఇక కూలీలతో కలిసి మంత్రి పనిచేయడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత వరకూ బాగనే ఉన్నా పెద్దోళ్లకైతే ఒక కూలీ  పేదోళ్లకైతే ఒక కూలినా అని అందరూ గుసగుసలాడుకుంటున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment