తాజా వార్తలు

Tuesday, 11 April 2017

టీడీపీలో నంద్యాల వార్..పోటీకి సిద్ధమైన శిల్పా, ఫారూఖ్

ఉప ఎన్నిక వేళ నంద్యాల సీటుపై తెలుగుదేశంలో వార్ నడుస్తోంది.. భూమా ఫ్యామిలీకి టిక్కెట్ కేటాయిం చడంపై పెద్ద దుమారమే రేగుతోంది.. అటు శిల్పా, ఇటు ఫారూక్ సీటు కోసం ఒత్తిడి తెస్తుండటంతో డిఫెన్స్ లో పడిపోయింది తెలుగుదేశం.. తమ్ముళ్ల తగవుతో ఈ పరిస్థితి వైసిపికి వరంగా మారినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. నంద్యాల బైపోల్ కాక రేపుతోంది.భూమా మరణంతో కర్నూలు జిల్లా రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.  రాజకీయం చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతోంది. భూమా నాగిరెడ్డి మరణంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు జరిగే ఎన్నికలో ఈ టిక్కెట్ ను భూమా కుటుంబానికే కేటాయిస్తామని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు అయితే ఇప్పుడీ ప్రతిపాదనపై టిడిపిలోనే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. భూమా కుటుంబానికి టిక్కెట్ కేటాయించాలని నిన్న మొన్నటి వరకూ సన్నాయి నొక్కులు నొక్కిన మాజీ మంత్రి ఎన్.ఎం.డి హుస్సేన్ ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. ఉప ఎన్నికలో టిక్కెట్ తనకు కేటాయించాల్సిందేని లేదంటే ఎమ్మెల్సీ ఇవ్వాలని ఫారూఖ్ డిమాండ్ చేస్తున్నారు. అధిష్టానం ఈ డిమాండ్ పట్టించుకోకపోతే టిడిపి అభ్యర్ధిని ఓడించడం ఖాయమని హెచ్చరిస్తున్నారు మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి వర్గీయులు కూడా అధిష్టానం ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన తమను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టిక్కెట్ ఇవ్వడం ఎంత వరకూ సమంజసమని శిల్పా మోహన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే భూమా అఖిలప్రియకు మంత్రివర్గంలో చోటిచ్చిన చంద్రబాబు మళ్లీ పార్టీ టిక్కెట్ కూడా వారికే కేటాయిస్తాననడం పట్ల శిల్పా వర్గం మండిపడుతోంది. అదే జరిగితే పార్టీకి దూరమవుతానని పరోక్షంగా ఆయన సంకేతాలు పంపుతున్నారు. ఒకవేళ భూమా కుటుంబానికే టిక్కెట్ ఖరారయిన పక్షంలో వైసిపి నుంచి లేదా స్వతంత్ర్య అభ్యర్ధిగానైనా తలపడాలని ఆయన ఆలోచిస్తున్నారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ను వీడి టిడిపిలో చేరిన శిల్పా గడచిన ఎన్నికల్లో వైసిపిలో ఉన్న ఎస్పీవై రెడ్డిని, భూమానాగిరెడ్డిని ఎదుర్కొని నంద్యాల మున్సిపాలిటీని టిడిపి పరం చేశారు. అలాగే నంద్యాల అసెంబ్లీ నుంచి బరిలోకి దిగి చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. శిల్పా ఓడిపోయినా ఇప్పటికీ ప్రజలు ఆయన్ను ఎంఎల్ ఏగానే సంభోదిస్తారు.అంతేకాదు సేవాభావంలోనూ, శిల్పా మోహన్ రెడ్డికి మంచిపేరు ఉంది సౌమ్యుడిగా గుర్తింపు ఉంది. శిల్పా మోహన్ రెడ్డి గనక టిడిపిని వదిలితే ఉప ఎన్నిక ఫలితం తారుమారయ్యే అవకాశాలున్నాయి. తన వర్గం కార్యకర్తలతో ఇప్పటికే రహస్య మంతనాలు సాగిస్తున్న శిల్పా మీడియాకు మాత్రం చెప్పడానికి ఇష్టపడటం లేదు. ఇద్దరు నేతలూ ఇలా తిరుగుబాటు ప్రకటించడంతో టిడిపి పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఫరూక్ వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే టిడిపికే నష్టమని కూడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు అటు ఫరూక్, ఇటు శిల్పా ఇద్దరూ పార్టీ టిక్కెట్ కోసం తగవు లాడుకుంటుంటే వైసిపి ఈ  సీటును ఎగరేసుకుపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు మరికొందరు ఉప ఎన్నిక వేళ టిడిపిలోఅసమ్మతి సెగలనుఎలా చల్లారుస్తుందో మరి.
« PREV
NEXT »

No comments

Post a Comment