తాజా వార్తలు

Friday, 7 April 2017

సీఎం రమేష్ పై కుర్చీలతో దాడిచేసిన టీడీపీ నేతలు

ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి దక్కడంతో.. ఆగ్రహం రగిలిపోతున్న సుబ్బారెడ్డి వర్గీయులు.. జమ్మలమడుగు సమావేశానికి వచ్చిన సీఎం రమేష్ పై దాడికి దిగారు. ఆదినారాయణ రెడ్డికి కేబినెట్ లో చోటు దక్కడంలో సీఎం రమేష్ పాత్ర ఉందంటూ.. సుబ్బారెడ్డి వర్గీయులు మండిపడ్డారు. మీటింగ్ కు వచ్చిన సీఎం రమేష్ ను చుట్టుముట్టిన కార్యకర్తలు.. ఆయనపై కుర్చీలను విసిరారు. దీంతో కార్యకర్తల సమావేశం ఉద్రిక్తంగా మారింది. 
కడప జిలాల్లో నివురు కప్పిన నిప్పులా ఉన్న.. తెలుగు తమ్ముళ్ల వర్గపోరు మరోసారి రాజుకుంది. పార్టీ కార్యాలయం సాక్షిగా తెలుగు తమ్ముళ్లు బాహబాహీకి దిగారు. కేబినెట్ విస్తరణ నాటి నుంచి అసంతృప్తితో ఉన్న సుబ్బారెడ్డి వర్గీయులు.. సీఎం రమేష్ పై దాడి చేశారు. నమ్మక ద్రోహం చేసిన సీఎం రమేష్ సమావేశం నుంచి వెళ్లిపోవాలంటూ.. ఆయన్ని చుట్టుమట్టారు. సీఎం రమేష్ గో బ్యాక్ అంటూ సుబ్బారెడ్డి వర్గీయులు నినాదాలు చేశారు.
కేబినెట్ విస్తరణ సమయంలో.. కడప జిల్లా నుంచి.. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిలో ఎవరికి అవకాశం కల్పించాలన్న దానిపై పెద్ద పంచాయితీనే జరిగింది. అయితే, రామసుబ్బారెడ్డికి ఎలాంటి అన్యాయం జరగదని.. సీఎం రమేష్, మంత్రి గంటా హామీ ఇచ్చారు. దీంతో రామసుబ్బారెడ్డి వర్గీయులు కాస్త శాంతించారు. అయితే, మంత్రివర్గ విస్తరణలో మాత్రం ఆదినారాయణ రెడ్డికి చోటు కల్పించి.. రామసుబ్బారెడ్డికి మొండి చెయ్యి చూపించారు. దీంతో అప్పటి నుంచి రామసుబ్బారెడ్డి వర్గీయులు సీఎం రమేష్ జోక్యంతోనే ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి దక్కిందని రగిలిపోతున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment