తాజా వార్తలు

Thursday, 6 April 2017

సెల్ఫీ సరదా ప్రాణాలమీదకు తెచ్చింది!

అమెరికాలోనే అత్యంత ఎత్తయిన బ్రిడ్జి మీద సెల్ఫీ తీసుకోవాలన్న ప్రయత్నంలో ఓ మహిళ బ్రిడ్జి పైనుంచి కింద పడింది. అయితే అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. సాక్రామెంటో ప్రాంతానికి చెందిన ఈ మహిళ కాలిఫోర్నియాలోని అబర్న్ సమీపంలో గల ఫారెస్ట్‌హిల్ బ్రిడ్జి మీద సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నించింది. నిజానికి 60 అడుగుల ఎత్తున్న ఆ బ్రిడ్జి మీదకు మనుషుల ప్రవేశాన్ని ఎప్పుడో నిషేధించారు. అయితే కింద పడినప్పుడు అదృష్టవశాత్తు నేరుగా నేలమీద పడకుండా మధ్యలో చెట్లు అడ్డుపడటంతో ప్రాణాలతో బతికిపోయింది. ప్రస్తుతం ఆమె స్పృహ కోల్పోయిందని, చేతులు గీరుకుపోయి, ఎముకలు కూడా విరాగాయని.. అందువల్ల శస్త్ర చికిత్సలు అవసరమని మహిళ స్నేహితురాలు పాల్ గాన్‌చారక్ తెలిపారు. ముందు తామిద్దరం అక్కడ బ్రిడ్జి మీద మామూలుగా ఫొటోలు తీసుకుంటున్నామని, ఆ తర్వాత బీమ్‌లను పట్టి ఉంచే పెద్ద బోల్టుల వద్ద కూడా తీసుకున్నామని, అంతలో ఆమె వాటిమీద కాలు పెట్టి, బ్యాలెన్స్ లేక వెనక్కి పడిపోయిందని చెప్పారు.

ఈ ఘటన తర్వాత కాలిఫోర్నియా పోలీసులు తమ ఫేస్‌బుక్‌ పేజీలో బ్రిడ్జి ఫొటో పెట్టారు. సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, అలా చేయొద్దని తెలిపారు. బ్రిడ్జి వద్ద ఆ మహిళతో పాటు మరికొందరు స్నేహితులు కలిసి క్యాట్ వాక్ చేశారు. ఆ తర్వాత ఫొటోలు తీసుకునే ప్రయత్నంలో ఆమె పడిపోయింది. ఆమెను చికిత్స కోసం సట్టర్ రోజ్‌విల్లె మెడకల్ సెంటర్‌కు హెలికాప్టర్‌లో తీసుకెళ్లారు. బ్రిడ్జి కింద ఉన్న వాక్‌వే మీద ప్రజలు నడవడాన్ని నిషేధించారు. వాటి మీద ఎవరైనా కనపడితే అరెస్టు చేయడానికి కూడా పోలీసులకు అధికారాలున్నాయి. ఆమెకు అదృష్టం బాగుండబట్టి బతికిపోయింది గానీ లేకపోతే ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యుల పరిస్థితి దారుణంగా ఉండేదని పోలీసులు తమ ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment