తాజా వార్తలు

Saturday, 8 April 2017

మీరు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? : రోజా

తుందుర్రు ఆందోళనకారులతో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమయం దొరకడం లేదని ఎమ్మెల్యే రోజా అన్నారు. శనివారం తుందుర్రులో దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు సంఘీభావం తెలిపిన ఆమె మీడియాతో మాట్లాడారు... చంద్రబాబుకు విలాసాల మీద ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యల మీద లేదన్నారు. ఆక్వాపార్క్‌ను సముద్రతీరానికి తరలించకపోతే బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మంత్రులు గన్‌మెన్‌లు లేకుండా తుందుర్రుకు వస్తే ప్రజల ఆందోళన తీవ్రత అర్థమౌతుందన్నారు. మొగల్తురు ఘటనలో ఐదుగురు చనిపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కోట్ల రూపాయల లంచాలు తీసుకోబట్టే యాజమాన్యానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి ప్రభుత్వ పెద్దలు వందల కోట్ల ముడుపులు తీసుకున్నారని అన్నారు. కాలుష్య నియంత్రణ బోర్డు నివేదికను తుంగలో తొక్కారని ఆమె విమర్శించారు. మహిళలపై లాఠీచార్జ్‌ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని అన్నారు. తుందుర్రు ఫ్యాక్టరీని తరలించేంత వరకు ఉద్యమం ఆగదని ఆమె స్పష్టం చేశారు.

ఈ జిల్లా నుంచి అత్యధికంగా తెలుగుదేశం ఎమ్మెల్యే లను గెలిపించి ఇచ్చినందుకు , ఈ ప్రాంతానికి మీరిచ్చిన బహుమతి అక్రమ కేసులు, లాఠీ దెబ్బలు, విష వాయువులతో ప్రాణాలు తీసేయడమా అని ఆమె సూటిగా ప్రశించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మహిళలపై అక్రమ కేసులు పెడుతున్నారు అంటే మీకు అసలు మనస్సుందా? కడుపుకు అన్నం తింటున్నారా ? గడ్డి తింటున్నారా అని రోజా తీవ్రంగా ప్రశించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment