తాజా వార్తలు

Wednesday, 3 May 2017

అమిత్‌షాకు అన్నం పెట్టిన దంపతులు మాయం !

ఇటీవల భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్‌బరి ప్రాంతంలో పర్యటించారు. ఆ సమయంలో ఓ స్థానికుడి ఇంట్లో భోజనం చేశారు. అయితే అమిత్‌షాకు అన్నంపెట్టిన ఆ దంపతులు ఇప్పుడు కన్పించడంలేదు. వారు గత రెండు రోజులుగా అదృశ్యమైనట్లు స్థానిక బీజేపీ నేత ఒకరు తెలిపారు.

గత వారం పశ్చిమ బెంగాల్‌లో పర్యటనలో భాగంగా నక్సల్బరీలో భాగమైన కతియజోటే అనే గ్రామానికి అమిత్‌ షా వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు మహాలీ తెగకు చెందిన రాజు మహాలీ, ఆయన భార్య గీత భోజనం వడ్డించారు. నేలపై పరిచిన చాపమీద కూర్చుని వారిద్దరు చెరో దిక్కున ఉండగా మధ్యలో కూర్చున్న అమిత్‌ షా పప్పన్నం, సలాడ్‌తో తృప్తిగా భోంచేసి వెళ్లారు.అయితే, ఆయన అలా వెళ్లినప్పటి నుంచి ఆ కుటుం‍బంపై స్థానిక తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఒత్తిడి చేస్తుండటమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. రాజు పెయింటర్‌గా పనిచేస్తుండగా గీతా మాత్రం పొలం పనులకు వెళుతుంటుంది.  ఈ విషయం స్థానిక మీడియాకు తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అంతకుముందే బీజేపీ నేత దిలీప్‌ బారుయి కూడా ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారంట.కాగా, రాజు దంపతులను కిడ్నాప్‌ చేసి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
« PREV
NEXT »

No comments

Post a Comment