తాజా వార్తలు

Tuesday, 27 March 2018

అఖిలపక్షం లక్ష్యం ‘వైయస్‌ఆర్‌సీపీ’?

నిన్న మొన్నటి దాకా హోదా అంటే జైలే అన్న పెద్ద మనిషి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గొంతు సవరించక తప్పలేదు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైయస్‌ఆర్‌సీపీని నిలువరించేందుకు చంద్రబాబు పిల్లి మొగ్గలేస్తున్నాడు. పక్కా అవకాశవాద రాజకీయ నాయకుడిగా మారిపోయి తన ఆత్మాభిమానాన్ని కూడా చంపుకుని రోజుకో మాటతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాడు. ఇప్పుడు సరికొత్తగా అఖిలపక్షం పేరుతో కొత్త డ్రామాకు తెరదీశాడు. అన్ని రాజకీయ పక్షాలను పిలిపించి నిర్ణయం తీసుకునే పేరుతో మరో కుట్రకు చంద్రబాబు బీజం పోసే పనిలోపడ్డాడు. ప్రత్యేక హోదా రాకపోవడంలో చంద్రబాబు ఉదాసీనత, అవకాశవాద రాజకీయాలే కారణమని రాజకీయవర్గాలతోపాటు ప్రజలందరికీ తెలిసిన విషయమే. తనపై ఉన్న అపవాదును తొలగించుకోవడానికి, తనకంటుకున్న బురదను వైయస్‌ఆర్‌సీపీకి పులిమేందుకు పూనుకున్నాడు. ప్రత్యేక హోదా పేరుతో అఖిలపక్షం ఏర్పాటు చేసి తీర్మాణం చేసి కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని బయటకు చెబుతున్నా.. లోతుగా ఆలోచిస్తే టీడీపీ ఇమేజ్‌ను పెంచుకోవడంతోపాటు.. వైయస్‌ఆర్‌సీపీని ప్రజల్లో చులకన చేసి చూపాలనే ఆలోచన స్పష్టంగా తెలుస్తుంది. టీడీపీ ఏర్పాటు చేసిన అఖిల పక్షానికి వైయస్‌ఆర్‌సీపీ ఎలాగూ దూరంగా ఉంటుంది. ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలోనూ రెండు సార్లు అసెంబ్లీలో తీర్మాణం చేసినా.. చంద్రబాబు మాత్రం ఏకపక్షంగా ఎవరి అభిప్రాయం తీసుకోకుండానే ప్యాకేజీకి అంగీకారం తెలిపాడు. పైగా ప్రత్యేక హోదా విషయంలోనూ గత నెలరోజుల్లో చంద్రబాబు పలుమార్లు మాటలు మార్చాడు. వైయస్‌ఆర్‌సీపీ అవిశ్వాసానికి  మద్ధతిస్తామని ఒకసారి, తూచ్‌ సొంతంగా మేమే అవిశ్వాసం పెడతామని ఒకసారి.. మంత్రి పదవులకు రాజీనామా చేసినా.. ఎన్‌డీఏలోనే ఉంటామని ఇంకోసారి.. పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేశాడు. క్లైమాక్స్‌ వరకు వచ్చిన ప్రత్యేక హోదా అంశాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం పణంగా పెట్టాడు. ఇలాంటి స్థితిలో టీడీపీ నిర్వహించబోయే అవిశ్వాసానికి వైయస్‌ఆర్‌సీపీ ఎలాగూ రాదని వారికీ తెలుసు. చంద్రబాబుకు కూడా ఇదే కావాలి. ఇదే అదనుగా భావించి అనుకూల మీడియాల్లో
జగన్‌ పార్టీ మీద ఊకదంపుడు అసత్య ప్రచారం చేయొచ్చనేది వారి ఆలోచన. టీడీపీ అఖిల పక్షానికి పిలిచినా వారికి చిత్తశుద్ధిలేదని ప్రచారం చేయడం ద్వారా వైయస్‌ఆర్‌సీపీని కార్నర్‌ చేసి టీడీపీని ఛాంపియన్లుగా నిలబెట్టడమే ఎల్లో మీడియా ప్లాన్‌. అఖిలపక్ష భేటీని అడ్డం పెట్టుకుని చంద్రబాబు డైరెక్షన్‌లో వైయస్‌ఆర్‌సీపీ మీద బురద చల్లడానికి ఎల్లో మీడియా పథక రచన చేసింది. చంద్రబాబు అనుకూల మీడియా మొత్తం మూకుమ్మడిగా కార్నర్‌ చేయాలనే ఉద్దేశ్యంతో తప్ప తెగించి పోరాడాల్సిన సమయంలో అఖిలపక్షంతో జరిగే ప్రయోజనం ఏమీ ఉండదని అందరికీ తెలిసిందే.

« PREV
NEXT »

No comments

Post a Comment