తాజా వార్తలు

Thursday, 17 May 2018

రమణ దీక్షితులు వెనుకున్నది ఎవరు?

తిరుమల శ్రీనివాసుని ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుపై వేటు వేయడం వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన టిటిడిపై, ప్రభుత్వంపైన చేసిన విమర్శలతో పాటు గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డితోనూ, ఇప్పుడు జగన్‌తోనూ, బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షాతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించడమే ఆయన ఉద్వాసనకు కారణంగా కనిపిస్తోంది అని రమణ దీక్షితుల మద్దతు దారులు చెబుతున్నారు.
గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమలలో ఆయనతో ప్రత్యేక యాగం చేయించారు రమణ దీక్షితులు. మొన్న అమిత్‌షా తిరుమలకు వచ్చినపుడు హడావుడి చేశారు. జగన్‌తోనూ సన్నిమితంగా ఉంటారన్న అభిప్రాయం ఉంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి తిరుమలకు వచ్చిన సందర్భంలో ఆయన్ను ఆశీర్వదించడానికి రమణ దీక్షితులు రాలేదని అంటున్నారు. ఇదంతా ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది అన్నది కొందరి వాదన!
రమణ దీక్షితులు.. ముందు నుంచి అధికారుల పనితీరుపై అసంతృప్తిగానే ఉంటున్నారు. ఎలా కావాలంటే అలా, ఎప్పుడు కావాలంటే అప్పుడు నిబంధనలు మార్చుకోవడం, కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం పట్ల పలు సార్లు ఆయన ఆరోపణలు చేశారు. తిరుమల ఆలయంలో ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా కొన్ని కైంకర్యాలు చేయడం, ఆలయంలో మార్పులు చేయడాన్ని కూడా ఆయన ఖండిస్తూ వచ్చారు. ఇటీవల గర్భగుడి పక్కభాగం నుంచి వెలుపలకు అల్యూమినియం రెయిలింగ్‌లతో ఆకాశ మార్గాన్ని ఏర్పాటు చేయడాన్ని కూడా వ్యతిరేకించారు. అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఈ ప్రయోగం చేశారు. ఇది ఆగమ శాస్త్రాలకు విరుద్ధమని రమణదీక్షితులు చాలాసార్లు చెప్పారు. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రిని కలుసుకుని, దాని వలన జరిగే నష్టాలను వివరించారు. దీంతో ముఖ్యమంత్రి ఆకాశమార్గం పనులను ఆపేయాలంటూ ఆదేశాలు జారీచేశారు. తిరుమలలో ప్రధాన అర్చకులకు విలువలు తగ్గిపోతున్నాయని రమణ దీక్షితులు భావిస్తున్నారు. టిటిడిని రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారని, టిటిడి నిధులను తరలిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. దీంతో ప్రభుత్వానికి రమణ దీక్షితులుపై ఉన్న కోపం నషాలానికి ఎక్కింది. ఆయనపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సిఎం నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.
రమణ దీక్షితులను తొలగించడానికి 65 ఏళ్ల వయో పరిమితి అస్త్రాన్ని బయటకు తీశారు. కొత్తవారిని నియమించాలంటే వయసు మీరిన వారిని రిటైర్‌ చేస్తున్నామని చెప్పారు. మొత్తంగా చూస్తే ప్రభుత్వం, టిటిడి ప్రణాళిక ప్రకారమే అర్చకులకు 65 ఏళ్ల వయో పరిమితిని తెరపైకి తెచ్చి, రమణ దీక్షితులుపై వేటు వేసింది అని విమర్శలు వస్తున్నాయి.
« PREV
NEXT »

No comments

Post a Comment