తాజా వార్తలు

Thursday, 17 May 2018

తిరగబడుతున్న బతుకులు ..! ఈ పాపం ఎవరిది?

ప్రమాద మృతులకు నష్టపరిహారం చెల్లిస్తాం … వారి కుటుంబాలను ఆదుకుంటాం … ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. ఆపై విషయం సద్దుమణిగాక సైలెంట్‌ అవ్వడం..! ఇవి ఏ ప్రమాదం జరిగిన ప్రభుత్వ పెద్దలు తీరు.. చెప్పే మాటలు. నిన్న నిండు గోదావరిలో మునిగిన 20 నిండు ప్రాణాలు తరవాత కూడా ఇవే మాటలు. ఇంకా ఎన్నాళ్ళు ఇలాగె వింటూ ఉండాలి . అసలు ప్రమాదాలే జరగకుండా చర్యలు తీసుకోలేరా? సాధ్య పడదా?
నిండు గోదావరిలో నిర్లక్ష్యం రాజ్యమేలింది. నది మధ్యలో జరగరాని ఘోరం జరిగింది. అందమైన పాపికొండల నడుమ పెను విషాదం నెలకొంది. ఎందరి జీవితాలో తలకిందు చేసింది. ఎన్నో కుటుంబాల గుండెల్ని పిండేసింది. అసలే సిమెంట్‌ బస్తాల బరువు… ఆపై పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించుకున్న లాంచీ… మధ్యలో వెళ్లగానే తిరగబడింది. దానికి ప్రకృతి కూడా తోడైంది. సుడిగాలి రూపంలో జలసమాధి చేసేసింది.
ప్రమాద మృతులకు నష్టపరిహారం చెల్లించడాలు… ఆదుకుంటామన్న ఊరడింపులు… ఉద్యోగం కల్పిస్తామన్న ఉపశమన వ్యాఖ్యలు… ఇళ్లు కట్టించి ఇస్తామన్న రాజకీయ కుయుక్తులు… ఇలా హడావిడి చేయడం… ఆపై సద్దుమణిగాక సైలెంట్‌ అవ్వడం!! ఇంకా ఎన్నాళ్లు, ఇలాంటి ఘోరాలు చూడాలి. మాటలకందని మృత్యుక్రీడను ఇంకెన్నాళ్లు భరించాలి.
ఏ లాంచీలోనైనా ప్రయాణికుల భద్రతకే పెద్దపీట వేయాలి. సర్కార్‌ లాంచీల్లోనైతే చట్టప్రకారం ఏంచేయాలో అంతోఇంతోనైనా చేస్తారు. కానీ ప్రైవేటు లాంచీల ఓనర్లకు ఇవేమీ పట్టింపుల్లేవు. ఇంకా చెప్పాలంటే పెద్దగా పట్టించుకోరు కూడా. భద్రత కల్పించే లైఫ్ జాకెట్లు ఉండవు. కంటితుడుపుగా చూపించేందుకు మాత్రమే అన్నట్టు కొన్ని జాకెట్లను పెట్టుకుంటారు. పైగా చెక్ చేసే వారే బోట్ల నిర్వహణలో భాగస్వాములు కావడంతో చెకింగ్‌లు కూడా అంతంత మాత్రమే.
ప్రమాదం జరుగుతుందని ఎవ్వరూ ఊహించరు కానీ… అలాంటి ఉపద్రవం మళ్లీ పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. చట్టాలను మరింత కఠినతరం చేయాలి. కనీసం గోదావరి లాంచీ ప్రమాదంతోనైనా తెలుగు రాష్ట్రాల పాలకులు కళ్లు తెరుస్తారని ఆశిద్దాం.
« PREV
NEXT »

No comments

Post a Comment