తాజా వార్తలు

Friday, 18 May 2018

శ్రీదేవి మృతి: మాజీ ఏసీపీ వివాదాస్పద వ్యాఖ్యలు

అతిలోక సుందరి శ్రీదేవి అకాల మరణం చెంది మూడు నెలలు కావస్తున్నా ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్‌ టవర్‌ హోటల్‌లో ఫిబ్రవరి 24 న ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి శ్రీదేవి మరణించారు. మొదట శ్రీదేవి గుండెపోటుతో చనిపోయినట్టు కథనాలు వచ్చాయి. ఆ తర్వాత గుండెపోటుతో కాదు.. స్పృహ కోల్పోయి తన హోటల్‌లో గదిలోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడిపోవడం వల్ల ఆమె చనిపోయిందని, దీని వెనుక ఎలాంటి నేరపూరిత కారణం కనిపించడం లేదని దుబాయ్‌ పోలీసులు తేల్చారు. 
అయితే తాజాగా ఢిల్లీకి చెందిన వేద్‌ భూషణ్‌ అనే మాజీ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీదేవి మృతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవిని పక్కా ప్లాన్‌ ప్రకారమే హత్య చేశారని ఆయన అన్నారు. బాత్‌టబ్‌లో బలవంతంగా ముంచి చంపడం చాలా సులువని, అలా చేస్తే మునిగి చనిపోయారని చెప్పి తప్పించుకునే అవకాశం ఉంటుందన్నారు. శ్రీదేవి ప్రమాదవశాత్తు చనిపోలేదని, ఆమెను పథకం ప్రకారం చంపేశారని అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. దుబాయ్‌ డాక్టర్లు ఇచ్చిన ఫోరెన్సిక్‌ నివేదికపై కూడా ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని ఆయన అన్నారు.  ఏసీపీగా రిటైర్డ్‌ అయి ప్రస్తుతం డిల్లీలో ఓ ప్రైవేటు ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీని నడుపుతున్న వేద్‌ భూషణ్‌ శ్రీదేవి మృతి చెందిన హోటల్‌కు కూడా వెళ్లారని, కానీ శ్రీదేవి మృతి చెందిన గదిలో సిబ్బంది అనుమతించలేదని ఓ మీడియా సంస్థ పేర్కొంది. దీంతో అదే హోటల్‌లో వేరొక గదిలో ఉన్న ఆయన, శ్రీదేవి మరణానికి దారితీసిన పరిస్థితులను అంచనా వేసినట్టు తెలిపింది.
కాగా, ఇదివరకే శ్రీదేవి అనుమానాస్పద పరిస్థితుల్లోనే మరణించారని సందేహం వ్యక్తం చేస్తూ.. స్వతంత్ర విచారణ చేపట్టాలని సునీల్‌ సింగ్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఒమన్‌లో శ్రీదేవి పేరిట ఉన్న రూ. 240 కోట్ల ఇన్సూరెన్స్‌ పాలసీ ఆమె దుబాయ్‌లో మరణిస్తేనే సొమ్మును విడుదల చేస్తారని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. అయితే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌ మాత్రం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇప్పటికే ఇలాంటి రెండు పిటిషన్లను నిరాకరించామని గుర్తు చేసింది. ఈ కేసులో జోక్యం చేసుకోలేమని దీపక్‌ మీశ్రా పేర్కొన్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment